వరంగల్: అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) ద్వి దశాబ్ది సందర్భంగా వచ్చె నెల నవంబర్ 15న వరంగల్ లో ‘తెలంగాణ విజయ గర్జన’ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపనేని నరేందర్ లతో కలిసి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం వరంగల్ మామునూరులోని సభ జరిగే స్థలాన్ని పరిశీలించారు.
సభాస్థలి, పార్కింగ్ స్థలం, హాజరయ్యే కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు సరిపోయే విధంగా ఉంటుందా? అనే విషయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇతరత్రా ఇంకా ఏమైనా స్థలాలు ఉన్నాయా? అనే విషయాన్ని కూడా మంత్రి పరిశీలిస్తున్నారు. అన్ని హంగులతో సభ విజయవంతం కావడానికి అవసరమైన స్థలం అవసరమని, అందుకు అన్ని విధాలుగా అనువైన స్థలం కావాల్సి ఉందని మంత్రి అన్నారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరై మాట్లాడతారని మంత్రి తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా సిఎం ప్రజలనుద్దేశించి ఇన్నేండ్లలో పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని నివేదిస్తారని మంత్రి తెలిపారు.
Errabelli Inspection at TRS Warangal Sabha Place