హన్మకొండ: జిల్లాలోని అంబేద్కర్ భవన్ లో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖ అధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళలను మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ వినయ్ లు సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ”అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి మహిళకు శుభాకాంక్షలు. మహిళల మీద సీఎం కెసిఆర్ కు ఎనలేని గౌరవం. మహిళా సాధికారతకు సీఎం కెసిఆర్ చేస్తున్నంత దేశంలో ఎవరూ చేయడం లేదు. ఈ రంగంలో మనకు వచ్చినన్ని అవార్డులు వేరే ఎవరికి రాలేదు. మహిళల కోసం కెసిఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ఆశా, అంగన్వాడి కార్యకర్తల ద్వారానే కరోనా మీద మనం విజయం సాధించాం. అర్పిలు, మెప్మా వర్కర్స్ కూడా టీమ్ గా పని చేశారు. అంగన్వాడీ వర్కర్స్ కు నెలకు రూ.13,650 ఇస్తున్నాం. అయాలకు రూ.7 వేలు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా ఈ జీతాలు లేవు.
గతంలో కెసిఆర్ కిట్లు ఉండెనా? ఇప్పుడు 15 రకాల వస్తువులు ఇస్తున్నాం. కడుపులో బిడ్డ పడ్డప్పుడు ఆరోగ్య లక్ష్మి పథకం మొదలవుతుంది. పౌష్ఠికాహారం అందిస్తున్నాం. కెసిఆర్ కిట్ల ద్వారా మగ పిల్లగాడు పుడితే రూ.12 వేలు, ఆడ పిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తున్నాం. డ్వాక్రా సంఘాలు వచ్చాక మహిళా సాధికారత వచ్చింది. ఇవాళ మహిళలను, భర్తలు గౌరవించే పరిస్థితి వచ్చింది. మరో కొద్ది రోజుల్లో 57 సంవత్సారాలు నిండిన వాళ్ళందరికీ పెన్షన్లు అందజేస్తాం
సీఎం కెసిఆర్ ఈ బడ్జెట్ లో మహిళల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో, చిన్న తరహా పరిశ్రమలు పెట్టడంలో మహిళలను ప్రోత్సహించేందుకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలని రూ.187 కోట్లు కేటాయించారు. మహిళా యూనివర్సిటీ కోసం బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం 1లక్షా 25వేల మందికి లబ్ది చేకూరే విధంగా కేసిఆర్ న్యూట్రీషియన్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజినిక్ కిట్స్ ఇస్తున్నారు. ఆసరా పెన్షన్, ఒంటరి మహిళ, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారు. మహిళల భద్రత, సంరక్షణకు, సాధికారతకు, అత్యవసర సేవలకు అనేక పథకాలు అమలు అవుతున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే” అని తెలిపారు.
Errabelli Participate in Women’s Day Celebration in Hanamkonda