పాలకుర్తి: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు వినియోగించుకొని సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్బోధించారు. శుక్రవారం పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని తీగారం, బంజారా గ్రామాలలోని దళిత వాడలలో దళితబందు కార్యక్రమం అమలుపై నిర్వహించిన గ్రామ సభలలో మంత్రి పాల్గొన్నారు. దళిత బందు కార్యక్రమంలో భాగంగా తీగారం గ్రామంలో 20 మంది, బంజారా గ్రామంలో 15 మంది షెడ్యూల్డ్ కులాల కుటుంబాల లబ్దిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో 10 లక్షల రూపాయలు జమ చేస్తామని ఆయన తెలిపారు. లబ్ధిదారులు లాభకరమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. లబ్ధిదారుడు ఎంపిక చేసుకున్న యూనిట్లను మార్చి 7వ తేదీ వరకూ గ్రౌండింగ్ చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. లబ్ధిదారుల ఎంపిక తదుపరి వారికి శిక్షణ, పెట్టబోయే పథకంపై లబ్ధిదారునికి సరైన అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులు శ్రద్ధ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల ఈ పథకాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికి దిక్సూచి అని మంత్రి తెలిపారు. మొదటి దశలో ఈనెల 5వ తేదీలోగా ప్రతి నియోజకవర్గం నుండి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా పాలకుర్తి నియోజకవర్గములో 6 గ్రామాల నుండి 100 మంది లబ్దిదారులను ఎంపిక చేస్తున్నామని ఆయన తెలిపారు. దళిత బంధు పథకం క్రింద రాష్ట్రంలోని 17 లక్షల మంది దళితులకు వచ్చే మూడు నాలుగు ఏళ్ళలో ఆర్థిక సహాయాన్ని అందించినున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా రాబోయే రాష్ట్ర బడ్జెట్ లో ఈ పథకం అమలుకు 20వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఆయన చెప్పారు. ఇలాంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదన్నారు.
Errabelli speech on Dalit Bandhu in Palakurthi