Saturday, December 21, 2024

త్వరలో ఎరుకల సాధికారత పథకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎన్నో ప్రతిష్ఠాత్మక పథకాలను ప్రవేశ పెట్టి యావత్ దేశం దృష్టిని ఆకర్శించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో అద్భుత పథకాన్ని ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఎరుకల సామాజిక వర్గం అభ్యున్నతి కోసం ఎరుకల సాధికారిత పథకానికి శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అత్యంత వెనుకబడిన ఎరుకల సామాజిక వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుచడం, సమాజంలో ఆత్మగౌరవంతో బతికేలా ప్రోత్సాహించాలనే లక్షంగా పథక రూపకల్పన చేస్తోంది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ పథకాన్ని ప్రకటించనున్నారు. గొల్ల కురుమలకు గొర్రెల పథకం తెచ్చిన విధంగానే ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వారి కుల వృత్తి అయిన పందుల పెంపకానికి ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ఉద్దేశం.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్షా 44 వేల జనాభా కలిగిన సామాజిక వర్గం ఎరుకల జాతి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 139 ఎరుకల సొసైటీలు ఉన్నాయి. పందుల పెంపకానికి వ్యక్తిగతంగా గాకుండా సొపైటీల పరంగా సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 50 శాతం సబ్సిడీతో రుణాలు అందించే అవకాశం ఉంది. గ్రామాల్లో ఎక్కడ బడితే అక్కడ పందులు సంచరించడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అలా గాకుండా గ్రామానికి దూరంగా సొసైటీ ఆధ్వర్యంలో షెడ్లను నిర్మించి పందుల పెంపకానికి ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. దీని వల్ల ఎరుకుల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. యూనిట్‌కు రూ 50 లక్షల వరకు సబ్సిడీ రుణం అందించే అవకాశం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రూపొందించే పనిలో అధికారలు ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News