ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో మంగళవారం మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం అనేకసార్లు బద్దలు కావడంతో వేలాది మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిపర్వతం నుంచి ఎగజిమ్మిన లావా సమీపంలోని సముద్రంలోకి జారిపడడంతో సునామీ హెచ్చరికలను అధికారులు జారీచేశారు. ఈ నెలలోనే ఆరుసార్లకు పైగా అగ్నిపర్వతం బద్దలైందని, ఈ ముప్పు తొలగిపోలేదని ఇండోనేషియా వాల్కనాలజీ సంస్థ హెచ్చరించింది. దాదాపు 6 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంగళవారం తెల్లవారుజామున 1.05 గంటలకు ఒకసారి, ఆ తర్వాత మరో రెడుసార్లు అగ్నిపర్వతం బద్దలైందని సంస్థ తెలిపింది.
అగ్నిపర్వతం నుంచి ఎగసిపడిన లావా ఆకాంశంలోకి 5 కిలోమీటర్లకు పైగా దూసుకువెళ్లిందని తెలిపింది. రువాంగ్ పర్వతం సమీపంలో నివసిస్తున్న 11,000 నుంచి 12,000 మంది ప్రజలను వేరే ప్రదేశాలకు తరలించినట్లు జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారీ తెలిపారు. ఎర్రని దట్టమైన బూడిద ఆకాశంలోకి ఎగసిపడుతున్న దృశ్యాలను సంస్థ విడుదల చేసింది. మండుతున్న శకలాలు స్థానిక గృహాలపై పడడం కూడా కనిపించాయి. రువాంగ్ పర్వతం చుట్టూ ఏడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎవరూ ఉండకుండా నిషేధం విధించారు.