Monday, April 21, 2025

ఆదాయం గోరంత.. వ్యయం కొండంత

- Advertisement -
- Advertisement -

నిత్యావసరాల ధరలు నింగిని తాకుతుండడంతో సామాన్య ప్రజల జీవన పరిస్థితులు తారుమారవుతున్నాయి. మోడీ ప్రబుత్వ పాలనలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసరాలు ధరలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులుపడుతున్నాయి. దేశంలో వేతనాల అంతరం పెరుగుతోంది. అధికార రంగాలు జీతాల పెంపుదలతో రాణిస్తుండగా, సామాన్య కార్మికుడి జీతాలుమాత్రం ఎక్కడ వేసిన గొంగళి అన్నచందంగా ఉంటోంది. గత దశాబ్దకాలంలో సాధారణ జీతాలు పొందే కార్మికులు కానీ, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు కానీ సగటు వాస్తవ ఆదాయాలు స్తబ్దుగా లేదా తగ్గుదలలో ఉండడం గమనార్హం. తక్కువ ఆదాయంతో జీవనం సాగిస్తున్న సాధారణ కార్మికులు తమ ఆదాయంలో కంటితుడుపు పెరుగుదలను మాత్రమే చూశారు.

ఇది పాలకులకు, పాలింపబడేవారికి మధ్య పెరుగుతున్న అగాధాన్ని స్పష్టంగా గుర్తు చేస్తోంది. ఇది నాణ్యమైన ఉపాధి కోసం ఆరాటం, పోరాటం సాగించే పరిస్థితికి ఆందోళనకరమైన సంకేతం. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ సభ్యుల జీతాలు, భత్యాలు ఇప్పుడు 2018 ఏప్రిల్ తరువాత మొదటిసారిగా సవరణకు నోచుకోవడం చర్చనీయాంశం అవుతోంది. ఎంపిలకు ఇదివరకు రూ. 1 లక్ష ఇస్తుండగా, ఇప్పుడు నెలకు రూ. 1.24 లక్షలు ఇస్తారు. అలాగే వారి రోజువారీ భత్యం రూ. 2000 నుండి రూ. 2500కు పెరిగింది. మాజీ ఎంపిలకు పెన్షన్ రూ.25,000 నుంచి రూ.31,000 కు పెరిగింది. ఐదేళ్లు దాటి సేవ చేసినందుకు సంవత్సరానికి అదనంగా రూ. 2500 లభిస్తాయి. ఆదాయం పన్ను చట్టం ప్రకారం వ్యయ ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా ఈ పెంపు జరిగినట్టు పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ తన నోటిఫికేషన్‌లో వివరించింది. ఇక రెగ్యులర్ జీత కార్మికుల పరిస్థితిని పరిశీలిస్తే సగటు నెలవారీ వాస్తవ ఆదాయాలు ఏటా 1.2 శాతం వంతున తగ్గాయని ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024 వెల్లడించింది.

2012లో రూ. 12,100 వరకు ఉండగా, 2019 నాటికి రూ. 11,155 వరకు తగ్గింది. అలాగే 2022 నాటికి 0.7 శాతం వరకు తగ్గి, రూ. 10,925కు చేరుకుంది. ఇక స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల సగటు వాస్తవ ఆదాయాలు ఏటా 0.8 శాతం తగ్గాయి. 2019లో రూ. 7017 వరకు ఉండగా, 2022 లో రూ.6843 వరకు తగ్గడం గమనార్హం. క్యాజువల్ కార్మికుల సగటు నెలవారీ వాస్తవ ఆదాయాలు పరిశీలించగా, వార్షికంగా 2.4 శాతం పెరిగింది. 2012లో రూ. 3701 నుండి 2019లో రూ. 4364కి పెరిగింది. మళ్లీ వార్షికంగా 2.6 శాతం పెరిగి, 2022లో రూ. 4712కు చేరింది. కార్మికుల వాస్తవ ఆదాయాలు లేదా వేతనాల్లో నిరంతరం పెరుగుదల ఉంటే ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతంగా, మెరుగైన నాణ్యతగల ఉపాధి సృష్టికి సూచికగా పేర్కొనవచ్చు. కానీ దేశంలో సాధారణ కార్మికులకు వాస్తవ వేతనాల్లో స్వల్పపెరుగుదల మాత్రమే ఉంటోంది. సాధారణ జీతం పొందే కార్మికులు, స్వయం ఉపాధి పొందే వారి వాస్తవ ఆదాయాలు పెరగకపోగా, తగ్గుతున్నాయని నివేదిక వెల్లడించింది. 2000 2022 మధ్య ఉపాధి కల్పన నాణ్యత పేలవంగా ఉందని సూచిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. రూ. 5000 వరకు నెలవారీ వేతనాలు కలిగిన రెగ్యులర్ కార్మికుల నిష్పత్తి పదేళ్ల కాలంలో 7.7% పాయింట్లు తగ్గిందని 2012 లో 34.6 శాతం ఉండగా, 2022 లో 26.9 శాతానికి తగ్గిందని నివేదిక వివరించింది.

దేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య ఆర్థిక అసమానత. జనాభాలోని ఒక్క శాతం మంది వద్ద ఐదింట ఒకవంతు జాతి ఆదాయం పోగుపడి ఉంటోందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. జనాభాలో సగం మంది దేశ ఆదాయంలో 13 శాతాన్ని మాత్రమే పొందుతున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం గత పదేళ్లలో దీనిని నిర్మూలించడానికి ప్రగల్భాలు తప్ప చేసిందేమీ లేదు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశ ఆర్థిక పరిస్థితి భేషుగా ఉందని మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పైన పటారం లోన లొటారం. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువగా సామాన్య ప్రజలు సతమతమవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు దొరుకుతున్నాయి. కానీ ఆదాయమే అనుకున్నంత స్థాయిలో ఉండడం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా అధ్వాన్నం. పట్టణ ప్రజలు తమ ఆదాయాలు స్తబ్దుగా ఉన్నాయని, ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మార్చి నెలలో 19 ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వేలో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మార్చి నాటికి సరకుల ధరలు బాగా పెరిగాయని పట్టణ వాసుల్లో 90 శాతం మంది చెప్పారు.

దీనివల్ల కుటుంబ ఖర్చులు భరించలేని విధంగా పెరిగాయని వెల్లడించారు. ఉద్యోగాల సంగతి ఎలా ఉన్నా అవసరాలు తీర్చుకోడానికి అనేక ఇబ్బందులు పడవలసివస్తోందని తమ పరిస్థితిని వివరించారు. దేశ ప్రజల్లో 20 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువన కునారిల్లుతున్నారు. 23 కోట్ల మంది రోజుకి రూ. 375 కంటే తక్కువ ఆదాయంతో జీవితాలు భారంగా గడుపుతున్నారు. మరోవైపు కుబేరులు మరీ కుబేరులవుతున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ మరోసారి సంపన్నుల జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. ఫోర్బ్ సంస్థ విడుదలచేసిన సంపన్నుల జాబితా 2025లో ముందు వరుసలో ఉన్నారు. 342 బిలియన్ డాలర్ల నికర విలువతో ఆయన అగ్రస్థానం దక్కించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే మస్క్ సంపద 147 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రపంచ కుబేరుడు మస్క్‌కు టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం యుఎస్ 902 మంది సంపన్నులతో బిలియనీర్ హబ్‌గా కొనసాగుతోంది.

చైనాలో 516 మంది బిలియనీర్లు ఉండగా, భారత్‌లో 205 మంది ఉన్నారు. ప్రముఖ భారత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ 92.5 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. ఆసియాలో అత్యంత సంపన్న భారతీయుడిగా కొనసాగుతున్నారు. మరో భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ 56.3 బిలియన్ డాలర్ల సంపదతో 28వ స్థానంలో ఉన్నారు. ఆసియాలో అత్యంత ధనవంతుడైన నాలుగో వ్యక్తి, దేశంలో అత్యంత ధనవంతుడైన రెండో వ్యక్తిగా నిలిచారు. చైనాకు చెందిన జాంగ్ యిమింగ్ 65.5 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలోని బిలియనీర్లలో 23వ స్థానం దక్కించుకోగా, అదే దేశానికి చెందిన జాంగ్ షాన్హాన్ 57.7 బిలియన్ డాలర్లతో 26 వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్ బిలియనీర్ల జాబితా ప్రకారం ఈసారి 288 మంది కొత్త వ్యక్తులు ఇందులో చేరారు.

కె.యాదగిరి రెడ్డి
98667 89511

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News