Wednesday, January 22, 2025

మనతెలంగాణ కథనానికి స్పందన…… కొత్తగా 14 ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

జిఓ జారీ చేసిన ప్రభుత్వం
త్వరలోనే పలువురు అధికారులు, సిబ్బందికి పదోన్నతులు
మనతెలంగాణ/హైదరాబాద్:  ఎక్సైజ్ శాఖలో కొత్తగా 14 పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు సంవత్సరాల క్రితం కొత్తగా 14 ఎక్సైజ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినా వాటి ఏర్పాటులో చాలా ఆలస్యం జరిగింది. ఈ సందర్భంగా పనిఒత్తిడితో పోలీసులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. రీ ఆర్గనైజేషన్ యాక్ట్ కింద సుమారుగా 85 మంది అధికారులు వివిధ హోదాల్లో పదోన్నతులు పొంది మూడేళ్లుగా బాధ్యతలను నిర్వహిస్తున్నా కొత్త పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేయకపోవడంతో ఎక్సైజ్ శాఖ విమర్శలు వెల్లువెత్తాయి.

పలువురు అధికారులు, పోలీసులు త్వరగా కొత్త పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేసి పనిఒత్తిడిని తగ్గించాలని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు విన్నవించడంతో కొత్తగా వాటిని ఏర్పాటు చేస్తూ (రీ ఆర్గనైజేషన్ యాక్ట్ కింద) జిఓ 113లో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే పలువురు అధికారులు, సిబ్బందికి పదోన్నతులను కల్పించి ఆయా కొత్త పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కొత్త పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుపై మనతెలంగాణ దినపత్రికలో ఈ సంవత్సరం మే 25వ తేదీన ‘త్వరలో అందుబాటులోకి కొత్త ఆబ్కారీ స్టేషన్‌లు’, అక్టోబర్ 03వ తేదీన ‘ఎక్సైజ్‌లో ఎక్సర్‌సైజ్ జరిగేనా’ అనే కథనాలను ప్రచురించగా అధికారులు స్పందించి కొత్త పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేస్తూ జిఓను జారీ చేశారు.

కొత్త పోలీస్‌స్టేషన్‌ల వివరాలు ఇలా….

హైదరాబాద్ జిల్లాలో కొత్తగా బంజారాహిల్స్ అండ్ ఫిలింనగర్ ప్రాంతాలతో కలిపి కొత్తగా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో కొత్త పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయగా ఇందులో గోపాలపురం, మహంకాళి, మార్కెట్, మారేడుపల్లి, తుకారంగేట్‌లను ప్రాంతాలను కలిపారు. చిక్కడపల్లిలో కొత్తగా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయగా అందులో చిక్కడపల్లి, గాంధీనగర్, దోమలగూడ ప్రాంతాలను కలిపారు. వీటితో పాటు శంషాబాద్ పరిధిలో గండిపేట్, కొండాపూర్ పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేయగా అందులో గండిపేట్ పరిధిలోని గండిపేట మండలాన్ని, కొండాపూర్ పరిధిలో మాదాపూర్ డివిజన్, కొండాపూర్ డివిజన్‌లను కలుపుతూ కొత్తగా పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేశారు.

ఇక సరూర్‌నగర్ డివిజన్‌లోని మీర్‌పేట్‌లో కొత్తగా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తుండగా అందులో చింతలకుంట, ఓంకార్‌నగర్, శక్తినగర్, జంగయ్య నగర్, క్రిస్టియన్ కాలనీ డివిజన్ 16, హస్తినాపురం, మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్, బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జల్‌పల్లి మున్సిపాలిటీలను కలుపుతూ ఈ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. పెద్ద అంబర్‌పేట్‌లో కొత్త పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయగా అందులో బిఎన్ రెడ్డిలోని వార్డు నెంబర్ 14ను, అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ, తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రాంతాలను కలిపారు.

కూకట్‌పల్లిలో కొత్త పోలీస్‌స్టేషన్…

ఇక మేడ్చల్‌లోని కొంపల్లిలో కొత్తగా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తుండగా అందులో వార్డునెంబర్ 129, నిజాంపేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్, దుండిగల్ మున్సిపాలిటీ, కొంపల్లి మున్సిపాలిటీల ప్రాంతాలను ఈ స్టేషన్ పరిధిలో చేర్చారు. కూకట్‌పల్లిలో కొత్త పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు వార్డు నెంబర్ 114, 122, 123, 124ల ప్రాంతాలను ఈ స్టేషన్‌లలో కలిపారు. దీంతోపాటు మల్కాజిగిరిలోని కాప్రాలో కొత్త పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేయనుండగా అందులో ఎఎస్‌రావును తప్పించి కాప్రా మండలం మొత్తాన్ని ఈ పోలీస్‌స్టేషన్ పరిధిలో చేర్చారు.

నాచారంలోనూ కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆ పిఎస్ పరిధిలో వార్డునెంబర్ 04, మీర్ పేట్ హెచ్‌బి కాలనీ, వార్డు నెంబర్ 05 మల్లాపూర్, వార్డు నెంబర్ 06 నాచారం, వార్డు నెంబర్ 07 చిలుకానగర్,వార్డు నెంబర్ 08 హబ్సిగూడలు ఉన్నాయి. అల్వాల్‌లోనూ కొత్త పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనుండగా అందులో అల్వాల్ మండలాన్ని కలిపారు. సంగారెడ్డిలోని అమీన్‌పూర్‌లో కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆ పిఎస్ పరిధిలో రాంచంద్రాపురం అండ్ అమీన్‌పూర్ మండలాన్ని కలిపారు. ఇక వరంగల్ అర్భన్‌లోని హసన్‌పర్తిలో కొత్తగా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఈ పిఎస్ పరిధిలో హన్మకొండ మండలం, డివిజన్ 4, డివిజన్ 5, డివిజన్ 6, డివిజన్ 7, డివిజన్ 8, డివిజన్ 9, డివిజన్ 10, డివిజన్ 49లోని జులాయివాడ, డివిజన్ 50, డివిజన్ 54, హసన్‌పర్తి మండలం, కమలాపూర్ మండలం, మల్‌రెడ్డి పల్లి తదితర ప్రాంతాలను ఈ పిఎస్ పరిధిలో చేర్చారు.

ఈ నెల లేదా వచ్చేనెలలో పిఎస్‌ల ఏర్పాటు

ఆబ్కారీ శాఖ నుంచి ప్రతి సంవత్సరం సుమారుగా రూ.35 వేల కోట్ల పైచిలుకు ఆదాయం వస్తుండగా రాష్ట్రవ్యాప్తంగా 40 ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలతో పాటు 139 ఆబ్కారీ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా 14 కొత్త స్టేషన్‌ల ఏర్పాటుతే అక్రమ మద్యం, గంజాయి, గుడుంబాలపై ఉక్కుపాదం మోపవచ్చని, మరింత సమర్ధవంతగా విధులు నిర్వహిస్తామని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ నెల లేదా వచ్చేనెలలో ఈ పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుతో పాటు సిబ్బందిని ఆయా పోలీస్‌స్టేషన్‌లకే కేటాయించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News