న్యూఢిల్లీ : జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) పరిధిలోని కేసుల సమీక్షకు కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య సలహా మండలిని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ మేరకు బోర్డు స్వరూపాన్ని ఖరారు చేసి, ప్రకటించింది. ఈ మండలికి జస్టిస్ యోగేష్ ఖన్నా ఛైర్మన్‌గా ఉంటారు. సలహా మండలిలో ఇతర సభ్యులుగా న్యాయమూర్తులు చంద్ర ధరి సింగ్, రజనీష్ భట్నాగర్ ఉంటారని శనివారం విడుదల అయిన నోటిఫికేషన్‌లో తెలిపారు. కటుతరమైన నియమనిబంధనలతో ఎన్‌ఎస్‌ఎ అమలులోకి వచ్చింది. ఈ చట్టం పరిధిలో దాఖలు అయ్యే అన్ని వ్యవహారాలు కేసుల సమీక్షకు ఈ త్రిసభ సలహా మండలి ఇప్పుడు అత్యంత ఉన్నతస్ధాయిలో ఏర్పాటు అయింది.
ఎన్‌ఎస్‌ఎ పరిధిలో ఎవరినైనా అనుమానాలు తలెత్తితే ఎటువంటి అభియోగాలు నమోదు చేయకుండానే ఏడాది పాటు నిర్బంధంలోకి పంపించేందుకు వీలుంది. ఇప్పుడు ఏర్పాటు అయిన సలహా మండలి తమ ముందుకు సంబంధిత విషయాలపై వచ్చిన సమాచారం, డిటెన్యూల వాదనలను పరిశీలించిన తరువాత ప్రభుత్వానికి తగు నివేదిక అందిస్తుంది. డిటెన్యూలుగా వ్యక్తులు పరిగణనలోకి వచ్చిన తరువాత కనీసం ఏడు వారాల వ్యవధిలోనే అనివార్యంగా తమ వివరణతో ముందుకు రావల్సి ఉంటుంది. ఈ దిశలో అన్ని విషయాలను బేరీజు వేసుకుంటూ ఈ ఎన్‌ఎస్‌ఎ సలహా మండలి ఈ చట్టంపై ఉన్న విమర్శలు ప్రతికూలతలు అనుకూలతలన్నింటిని సమీక్షించుకుంటుంది.