Tuesday, December 17, 2024

పరిశ్రమలకు పచ్చ తివాచీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం స్వాగతం పలుకుతోంది. అవసరమైన అన్ని అనుమతులు, భూకేటాయింపులను త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు చేపడుతోంది. కొత్త పాలసీ విడుదల చేయడంతో తెలంగాణలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు కూడా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం భూకేటాయింపులు జరిగిన ముఖ్యమైన కంపెనీల్లో ఇండోనేసియాకు చెందిన మయూర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు రూ.158.80 కోట్ల పెట్టుబడి ద్వారా 866 మందికి ఉపాధి లభించనుంది. లోహం మెటీరియల్స్ ప్రై.లి.(లిథియం అయాన్ బ్యాటరీ తయారీ పరిశ్రమ) ఏర్పాటు కోసం రూ.502 కోట్ల పెట్టుబడులతో 414 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అమృతాంజన్ హెల్త్ కేర్ లిమిటెడ్ రూ.125.04 కోట్ల పెట్టుబడులతో 142 మందికి, జయదుర్గ హోమ్ డెకర్స్ రూ.114.12 కోట్ల పెట్టుబడులతో 950 మందికి, డ్రోగో డ్రోన్స్ ప్రై.లి రూ.34.63 కోట్ల పెట్టుబడులతో 300 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

వేగంగా ముందుకు సాగుతున్న అనుమతుల ప్రక్రియ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇటీవల దావోస్, అమెరికా, దక్షిణ కొరియాలో చేపట్టిన పర్యటనలతో రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. ఇద్దరు నేతలూ తమ పర్యటనలో వివిధ కంపెనీలతో విస్తృతంగా జరిపిన చర్చల ఫలితంగా అనేక సంస్థలు రాష్ట్రంలో తమ కంపెనీలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకువచ్చాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన కంపెనీలతో పరిశ్రమల శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారికి అవసరమైన భూమిని సమకూర్చే ప్రయత్నం చేస్తోంది. తద్వారా కంపెనీలు తీసుకొచ్చే క్రతువులో కీలక భూమిక పోషిస్తోంది. టీజీఐఐసీ ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపన, అనుమతుల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చే ప్రతి సంస్థకూ టీజీఐఐసీ అండగా ఉంటోంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే కంపెనీల పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల పాలసీలకు అనుగుణంగా ఉన్న కంపెనీలకు ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. కంపెనీలకు అందించే ప్రతి గజం భూమి సద్వినియోగం అయ్యేలా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు.

16 పరిశ్రమలకు మంత్రివర్గ ఉపసంఘం పచ్చజెండా : తెలంగాణలో కొత్తగా పలు పరిశ్రమల స్థాపనకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. 24 పరిశ్రమలపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం. ఇందులో 16 కంపెనీలకు ఆమోదముద్ర వేసినట్లు, మరో 8 పరిశ్రమలకు సంబంధించి మరింత సమాచారం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిశ్రమలకు ప్రోత్సాహంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక సంస్థలను ఆహ్వానించింది. భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. దీంతో సానుకూలంగా స్పందించిన పలు కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వచ్చి తమ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచాయి. ఈ ప్రతిపాదనలపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది.

వీటిలో ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది, రాయితీల గడువును పెంచమని కోరుతున్న కంపెనీలు కొన్ని ఉండగా, భూ కేటాయింపుల్లోనూ రాయితీలు అడుగుతున్నవి మరికొన్ని ఉన్నాయి. ఇలాంటి రెండు సిమెంట్ కంపెనీలు, ఒక ఆహార పరిశ్రమలతో పాటు మరో ఐదు పరిశ్రమలకు సంబంధించి మరిన్ని వివరాలను సమర్పించాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మరో సమావేశంలో వీటిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆమోదించిన కంపెనీలకు అవసరమైన భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులను ఆదేశించింది. పరిశ్రమలకు అవసరమైన అనుమతుల జారీలో రెవెన్యూ, విద్యుత్, జలమండలి, రోడ్లు భవనాలు, కాలుష్య నియంత్రణ మండలి, తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది.

566.53 ఎకరాల భూమిని కేటాయింపు : టీజీఐఐసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి ,ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన 10 కాలంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో 321 కంపెనీలు రాష్ట్రంలో రూ.7,108 కోట్లను పెట్టుబడులుగా పెట్టేందుకు ముందుకు వచ్చినట్టు టీజీఐఐసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా 25,277 మంది తెలంగాణ యువతకు ఉద్యోగావకాలు లభిస్తాయని ఇప్పటివరకు అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. ఆయా కంపెనీల స్థాపన కోసం టీజీఐఐసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 566.53 ఎకరాల భూమిని కేటాయించినట్లు వివరించారు.

రాష్ట్రంలో గత పది నెలల్లో కొత్త పరిశ్రమల స్థాపనలో పురోగతిపై నివేదికను ఇటీవల విష్ణువర్ధన్‌రెడ్డి విడుదల చేశారు. గత నెలలో పరిశ్రమలకు చేసిన కొన్ని భూకేటాయింపుల వివరాలను వెల్లడించారు. గతనెలలోనే తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, స్టేట్ లెవెల్ ల్యాండ్ అలాట్‌మెంట్ కమిటీకి వచ్చిన భూకేటాయింపుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం 70 కంపెనీలు భూకేటాయింపులకు అర్హమైనవి టీజీఐఐసీ గుర్తించి వాటికి సంబంధించిన భూకేటాయింపులు ఉత్తర్వులు జారీచేసింది. తద్వారా రూ.1,721 కోట్ల పెట్టుబడులు, 7,543 మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News