Monday, December 23, 2024

కమలం అగ్రనేతలతో ఈటెల, రాజగోపాల్‌రెడ్డి భేటీ

- Advertisement -
- Advertisement -
రాష్ట్ర పార్టీలో పరిస్థితులపై వివరించిన సీనియర్లు
పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఒంటెద్దు పోకడలపై ఫిర్యాదు
కొత్త నాయకునికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని నడ్డాకు సూచనలు

హైదరాబాద్: రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న పరిమాణాలపై ఆరా తీసిన హస్తిన పెద్దలు పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇప్పటికే పూర్తి సమాచారం తెప్పించుకుని వాటికి పరిష్కారం చూపేందుకు సీనియర్ నాయకులు ఢిల్లీకి రావాలని ఆదేశిస్తున్నారు. శనివారం మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలిపించుకుని పార్టీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా వారితో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారం చేపట్టేలా సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరడంతో వారిద్దరు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ ఒంటెద్దు పోకడలతో పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందని, కర్నాటక ఎన్నికల తరువాత ఆయన గ్రూపులుగా నాయకులు వీడదీస్తూ ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులను చులకన చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు.

తన అనుచరులకే అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం పనిచేస్తే వారిని దూరంగా పెడుతున్నారని మండిపడినట్లు చెబుతున్నారు. పార్టీ బలోపేతం కోసం నిర్వహించే సమావేశాలకు తమకు సమాచారం లేదని, గతంలో ఉన్న విలువకూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తగా కార్యవర్గం నియామకం చేసిన తమ అనుచరులకు చోటు కల్పించలేదని ఆయనకు అనుకూలమైన వారికి పార్టీ పదవులు కట్టబెడుతున్నారని పేర్కొన్నట్లు రాష్ట్ర నాయకులు వెల్లడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో పూర్తిగా విఫలమైయ్యారని, వెంటనే ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించి సీనియర్లకు అవకాశం ఇస్తే పార్టీ మరింత పుంజుకుంటుందని చెప్పారు. గతంలో పలుమార్లు విమర్శలు చేసి ప్రజల ముందు పార్టీ పరువు తీశారని, ప్రధాని మోడీ 9 సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించడంలో ఫెయిల్ అయ్యారని ఆరోపించారు.

గడిచిన ఎన్నికల్లో గోషామహల్ సీటు గెలవగా, ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజురాబాద్‌లో విజయం సాధించి పార్టీని పలు జిల్లాలకు విస్తరించినట్లు తెలిపారు. ఇదే విధంగా బండి పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవడం కష్టమని, పార్టీలో అసమ్మతి నాయకులతో సమావేశం జరిపి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని, దీంతో చాలామంది నాయకులు ఇతర పార్టీలకు వలస వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వారు వెల్లడించినట్లు తెలిసింది. త్వరగా పార్టీకి కొత్త కార్యవర్గం నియమించి ఎవరికి బాధ్యతలు అప్పగించిన ఇతర నాయకులు అడ్డుపడకుండా చూస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి కమలం అన్ని నియోజకవర్గాల్లో బలం పుంజుకుంటుందని, అదే విధంగా ఇతర పార్టీల్లో అసమ్మతి నాయకులు కాషాయం కండువా కప్పుకుంటున్నారని వారు వివరించినట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఈటెల, కోమటిరెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి రాష్ట్ర పార్టీ పరిస్థితిని అమిత్‌షాకు వివరిస్తారని వారి అనుచరులు పేర్కొంటున్నారు.

తాము పార్టీ మారుతామని ప్రచారం అవాస్తవమని,  తాము బిజెపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతామనే ప్రచారం అవాస్తవమని కొందరు నాయకులు తమను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం బిజెపిలో ఉన్నామని, భవిష్యత్తులో కూడా ఉంటామని పార్టీ బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తామని ఈటెల, కోమటిరెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News