Monday, March 24, 2025

కాంగ్రెస్ కూడా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారింది

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్, బిఆరెస్ ఒకే తాను ముక్కలు
డీలిమిటేషన్ అఖిలపక్ష సమావేశంపై ఎంపీ ఈటల స్పందన

మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిందని మల్కాజ్‌గిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ మీద ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకుండానే ప్రతిపక్షాల రాద్దంతం సరికాదని అన్నారు. తమిళనాడులో శనివారం జరిగిన డీలిమిటేషన్ అఖిలపక్ష సమావేశంపై ఎంపీ ఈటల స్పందించారు. జనాభా నియంత్రణ చేసిన దక్షిణ భారతదేశ రాష్ట్రాలను ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు ఉంటాయి తప్ప, నిరుత్సాహపరిచే విధంగా ఉండవని ఈటల పేర్కొన్నారు.

కాంగ్రెస్, బిఆరెస్ రెండూ ఒకే తాను ముక్కలని, అధికారం కోసం అర్రులు చాచే వాళ్లని మండిపడ్డారు. బీజేపీ ప్రజల కోసం ఆలోచన చేస్తే వీళ్లు సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తారని విమర్శించారు. ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే మాట్లాడడం మంచిపద్దతి కాదని, ఇలా మాట్లాడకుండా కేంద్రం విధి విధానాలు ప్రకటించినప్పుడు మాట్లాడితే మంచిదని అన్నారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశం కోణంలో ఆలోచన చేయాలి తప్ప సంకుచిత ఆలోచన చేయవద్దని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని సభలైనా పెట్టుకోవచ్చునని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రచారాలను నమ్మి సమావేశం నిర్వహించడం సరికాదని హితవు పలికారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇలానే కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేసి ఇప్పుడు కుప్పకూలిపోయిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ అబద్ధపు ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. ఆ శక్తి ఎవరికీ లేదు సాధ్యం కాదని తెలిసినా కూడా మోసకారులు, అబద్ధాల కోరులు ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తారనడానికి ఆ ఒక్క ఉదాహరణ చాలని ఈటల తెలిపారు. సీట్లు తగ్గుతాయనిది కూడా అలాంటి ప్రచారమేనని స్పష్టం చేశారు. గొప్ప రాష్ట్రంగా ఉన్న కర్ణాటకని కాంగ్రెస్ ఖతం పట్టించిందని అన్నారు. ఇలా రాష్ట్రాలను దిగజార్చి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసి అప్పులు పుట్టని రాష్ట్రాలుగా చేశారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News