Monday, December 23, 2024

చట్టసభల మీద బిఆర్‌ఎస్‌కు విశ్వాసం సన్నగిల్లింది:ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చట్ట సభలపై ముఖ్యమంత్రికి నమ్మకం సన్నగిల్లిందని బిజెపి ఎమ్మెల్యే, ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చా వేదికలు అసెంబ్లీ, పార్లమెంట్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే ప్రజల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని ఆశ పడతరు. కానీ కెసిఆర్ కి చట్ట సభల మీద విశ్వాసం సన్నగిల్లింది అనడానికి సజీవ సాక్ష్యం మొన్నటి సమావేశాలు అన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు 11 రోజులు, వర్షాకాల సమావేశాలు 3 రోజులు.. ఇలా ఈ ఏడాది మొత్తం 14 రోజులు మాత్రమే జరిగాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 60 రోజుల పాటు సమావేశాలు నిర్వహించేవారని చెప్పారు.

ధరణి పేదల కోసం కాదు.. పెద్దల కోసం…
ధరణి పేదల కోసం కాదు.. పెద్దల కోసం. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల కలెక్టర్లకు టార్గెట్లు పెట్టారని రాజేందర్ ఆరోపించారు. ఎమ్మెల్యేలంటే నియోజకవర్గాల్లో ఉంటూ పోలీసుస్టేషన్లకు ఫోన్ చేసే వాళ్లుగా మార్చారు. అసెంబ్లీలో నేడు 4 పార్టీలే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 15 పార్టీలు ఉండేవి. అన్ని పార్టీలతో బిఎసి సమావేశం నిర్వహించేవారు. లోక్‌సత్తా నుంచి ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న జయప్రకాశ్ నారాయణ కూడా బిఎసిలో పాల్గొనేవారు. నేడు జాతీయ ఉ పార్టీగా ఉన్న బిజెపికి బిఎసికు ఆహ్వానం లేదు. బిజెపి సభ్యులకు అసెంబ్లీలో ఒక గది కేటాయించాలని వేడుకున్నా పట్టించుకోవడం లేదు.

ప్రతిపక్షాలపై దాడికి సమావేశాలు..
శాసన సభ సజావుగా సాగిందని అధికార పార్టీ నేతలు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. స్పీకర్.. అధికార పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఎన్ని గంటలైనా మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా అనుమతించారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఉన్న నాయకులుగా ప్రతిపక్ష నేతలుగా మాట్లాడేందుకు స్పీకర్ గారు అవకాశం ఇవ్వలేదు. మాదిక్కు కన్నెత్తి కూడా చూడకుండా బెల్లు కొడుతూనే ఉంటారు. ముఖ్యమంత్రి స్వయంగా మజ్లిస్ మా మిత్రపక్ష పార్టీ అని చెప్పిన తర్వాత దానికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రభుత్వాన్ని పోగడనంతగా మజ్లిస్ నేతలు కొనియాడారు.

వారి మాటలు వారి చేష్టలు చూస్తే ఎంత జుగుప్చాకరంగా వీరి బంధం కొనసాగుతుందనేది తెలంగాణ ప్రజలుగా మీరే న్యాయ నిర్ణయితలుగా ఆలోచన చేయండి. నిజమైన న్యాయ నిర్ణీతలు ప్రజలే. వరదలలో 41 మంది కొట్టుకుపోయినా సభలో కనీసం సంతాపం తెలపలేదు. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇల్లు మునిగిన వారికి 25 వేలు, షాపులకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం సోయి తెచ్చుకుని స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. రానున్న ఎన్నికల్లో 109 సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి అహంకారంతో చెబుతున్నారు. మూడు రోజులు సభ జరిగితే ఒకటో రోజు హరీశ్ రావు.. రెండో రోజు కెటిఆర్.. చివరి రోజు కెసిఆర్ ప్రతిపక్షాలపై దాడి చేయడానికే సరిపోయింది.

కేటాయింపులున్నా.. ఖర్చు చేయడం లేదు..
బడ్జెట్ పెరుగుతోంది.. కేటాయింపులు తగ్గుతున్నాయి. కొన్ని శాఖలకు కేటాయింపులు ఉన్నా ఖర్చు చేయడం లేదు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ప్రభుత్వం తీరు ఉంది. రైతులు తీసుకున్న రుణాలకు రూ.13 వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్ల రూపాయలు వడ్డీ పెరిగిపోయింది. భూములు అమ్మవద్దని నాడు. అసెంబ్లీలో ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశాం.. నేడు భూములు ఎలా అమ్ముతున్నారు?. ప్రచారం కోసమే ఎకరా రూ. 100 కోటు అని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పేందుకే ఇలా చేస్తున్నారు‘ అని సమావేశంలో రాష్ట్ర బిజెపి నేతలు ఇంద్రసేనారెడ్డి, ప్రకాశ్ రెడ్డి, తుర్క నరసింహ, రాణి రుద్రమ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News