Wednesday, October 16, 2024

సొమ్ములు కేంద్రానివి..సోకులు రాష్ట్ర ప్రభుత్వానివి:ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం అనేక రూపాల్లో రాష్ట్రానికి నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సోకులు చేస్తోందని మల్కాజ్‌గిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ విమర్శించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం వద్ద అదనంగా ఒక్క రూపాయి ఖర్చు చేసే స్థోమత లేదని విమర్శించారు. ఈ విషయం అంగీకరించకుండా కాంగ్రెస్ నేతలు బీజేపీ ఎంపీలపై ఆడిపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు అన్ని విధాలుగా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వాలకం చూస్తే బాధగా ఉందని అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని దుమ్మెత్తిపోస్తున్నారని, ఇంతకీ వీళ్లకు అవగాహన ఉందా లేదా అని ప్రశ్నించారు.

నేనూ ఆర్థిక మంత్రిగా పని చేశానని, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఓ రాష్ట్రానికి ప్రాధాన్యత మరో రాష్ట్రానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వదని అన్నారు. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, నితిన్ గడ్కరీతో భేటీ అయిన వివరాలను ఆయన వెల్లడిస్తూ ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు 50 శాతం దాటాయని అన్నారు. సీఎస్‌ఎస్ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 40 శాతం నిధులు జమ చేయకపోవడం వల్లే కేంద్రం నుంచి వచ్చే నిధులు సకాలంలో రావడం లేదని తెలిపారు. అంతే తప్ప బట్టకాల్చి మీద వేయడం సరికాదని చెప్పారు.

రేవంత్ సర్కార్ కొత్తగా చేస్తున్నదేమి లేదు
రాష్ట్రంలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని, వాటన్నింటిని ఒక్కటి చేయడం తప్పా రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా చేస్తున్నదేమి లేదని ఈటల రాజేందర్ అన్నారు. ఉన్న స్కూళ్లను మూసి వేయకుండా కొత్త భవననాలు, సరిపడా సిబ్బందిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో కెసిఆర్ ఆర్భాటం చేసి ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌కు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రెసిడెన్షియల్ స్కూళ్లకు డైట్ చార్జీలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని విమర్శించారు.

ఇకనైనా రేవంత్ రెడ్డి డాంబికాలు మాట్లాడకుండా నేలమీదకు దిగి వచ్చి పేద పిల్లలు చదువుకునే హాస్టల్స్‌కు అద్దెలు, డైట్ చార్జీలు చెల్లించాలని సూచించారు. సంవత్సరాల పాటు అద్దెలు చెల్లించకుండా హాస్టల్ బిల్డింగ్‌లకు యజమానులు తాళాలు వేస్తే క్రిమినల్ కేసులు వేస్తామంటే ఇంతకంటే వెర్రితనం మరొకటి ఉండదా? అని ఈటల ప్రశ్నించారు. దబాయింపులతో ప్రభుత్వాన్ని ఎప్పుడు నడపలేరన్నారు. ప్రభుత్వం డొల్లతనం అందరికి తెలిసిపోయిందని, మంత్రులు కోపానికి రావొద్దని హితవు పలికారు. గత ప్రభుత్వం కూడా ఇలాగే బెదిరిస్తే వారికి ఏం గతి పట్టిందో అందరం చూశామని అన్నారు. వారిని చూసి కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోకపోతే ఇక వారి ఖర్మ అన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయిందని కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా కొత్త కేటాయింపులు లేవని తెలిపారు.

హైడ్రా చర్యలతో ప్రజల ఆందోళన
గతంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన 2.40 లక్షల ఇండ్లను బిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్మించలేకపోయిందని, నిర్మాణం పూర్తయిన వాటిని కూడా పంపిణీ చేయలేక పోయారని తెలిపారు. అందువల్ల ఈసారి రాష్ట్రంలో ఎక్కువ మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో ఎక్కువ ఇళ్లు ఇవ్వాలని కోరానని అన్నారు. అర్భనైజేషన్ పేరుతో హైదరాబాద్‌లో అనేక చెరువులు మాయం అయ్యాయని, అందువల్ల ఉన్న చెరువులను కాపాడుకునేందుకు చెరువులను విస్తరించి సుందరీకరణ పనులు చేపట్టేందుకు సహకరించాలని కోరినట్లు చెప్పారు. హైడ్రా చర్యలతో అనేక మంది నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో నాల విస్తరణకు నిధులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News