Monday, October 7, 2024

మూసీ ప్రక్షాళనకు తాను వ్యతిరేకం కాదు..అడ్డగోలు కూల్చివేతలు చేస్తే ప్రతిఘటిస్తాం

- Advertisement -
- Advertisement -

తాను హైడ్రా సంస్థకు, మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, అడ్డగోలుగా పేదల ఇళ్లను కూల్చివేస్తామంటే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తానని మల్కాజ్‌గిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదల అభ్యున్నతే లక్ష్యంగా తాను కొట్లాడే వ్యక్తినని పేర్కొన్నారు. హైడ్రా సంస్థకు, హైదరాబాద్ ముంపు గురికాకుండా చూసేందుకు, మూసీ ప్రక్షాళనకు, మూసీను కొబ్బరినీళ్లలా చేసేందుకు, ఎకలాజికల్ బాలన్స్ కాపాడడానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈతకొట్టేలా చెరువులు తయారు చేయడానికి తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో, ప్రభుత్వం అనుమతించిన లే అవుట్‌లలో ఇండ్లు కట్టుకున్న నిరుపేద ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ మీరు చేస్తున్న అడ్డగోలు కూల్చివేతలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈటెల రాజేందర్ బహిరంగ లేఖ రాశారు.

అడ్డగోలు కూల్చివేతలు చేపడితే మాత్రం ప్రతిఘటిస్తానని స్పష్టం చేశారు. పేదల ఇండ్లపై దొంగలలాగా దాడి చేసి మీరు చేస్తున్న కూల్చివేతలు, ఇస్తున్న నోటీసులు ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. చట్టప్రకారం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, మీకేమీ అపరిమిత అధికారాలు లేవు అని గుర్తు చేస్తున్నానని తెలిపారు. పేదలను ఇబ్బంది పెట్టడానికి కాదు మీకు అధికారం ఇచ్చింది, వారి సమస్యలు పరిష్కరించడానికి పేర్కొంటూ పేదల పక్షాన కొట్లడడం నా కర్తవ్యమని ఈటల లేఖలో వెల్లడించారు. పదేళ్ళ ఉన్న కేసీఆర్ మూసీ ప్రక్షాళన చేస్తానని చేయలేదని, మీరు మూసీ ప్రక్షాళన చేస్తానంటే అడ్డుకోమని ఈటల తెలిపారు. పిడికెడు అక్రమ ఇళ్లను బూచిగా చూపి కోట్ల విలువ చేసే ఇళ్లను కూలగొడుతున్నారని అన్నారు. బ్యూటిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారా అంటూ సిఎంను ఈటల ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు మీ కార్యాచరణ ఏమిటి, డీపీఆర్ ఉందా..? ఇళ్ళు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటి…?

కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా? అని సిఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు. సబర్మతి నది ప్రక్షాళనకు రూ.2 వేల కోట్లు, నమో గంగ ప్రాజెక్ట్ కి 12 ఏళ్లలో రూ.22వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు లక్షా 50 వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయని ఎంపి ఈటల నిలదీశారు. ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News