Sunday, November 17, 2024

నా పాత్రేంటో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది:ఈటల

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో తన పాత్రను పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. పార్టీలో తన పాత్రను తాను నిర్ణయించలేనని, అది తన చేతిలో ఏమీ లేదని పేర్కొన్నారు. ఏఏ సభ్యులకు ఏఏ బాధ్యతలు అప్పగించాలన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుందని అన్నారు. ఆయన సోమవారం కేంద్రమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్ష బాధ్యతలు తనకు అప్పగించనున్నారని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తాను ఏ పదవినీ అడగలేదని, పార్టీ ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటే దానిని శివరసావహిస్తానని అన్నారు. ప్రతి ఎంపీ క్యాబినెట్ మంత్రి కాలేరని, తాను కూడా దాని గురించి ఏమీ ఆశించలేదని స్పష్టం చేశారు. ఒక్కో రాష్ట్రానికి వేర్వేరు డిమాండ్లు ఉన్నాయి, వాటిని పరిష్కరించాల్సిన అవసరం పార్టీపై ఉంటుందని అన్నారు. ప్రతి సభ్యునికి ఏఏ బాధ్యతలు అప్పగించాలనేది పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. కాగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి ఈటల శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు కూడా ఇరువురు కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు.

అమిత్‌షాతో ఈటల భేటీ
అమిత్ షాతో ఈటల ప్రత్యేకంగా సోమవారం భేటీ అయ్యారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు అమిత్ షాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటలతో పలు అంశాలపై ఈ భేటీలో అమిత్‌షా చర్చించినట్లు తెలుస్తోంది. ఈటలకు తెలంగాణ బిజెపి పగ్గాలు అప్పగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ బిజెపి నుండి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎనిమిది మంది ఎంపీలతో పార్టీ జాతీయ స్థాయిని పెంచిన కిషన్‌రెడ్డి మళ్లీ క్యాబినెట్ మంత్రిగా నియమితులు కాగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర సహాయ మంత్రిగా అరంగేట్రం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించడం దాదాపు ఖాయమని చెబుతున్న నేపధ్యంలో ఈటల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

పార్టీ నుంచి అధికారికంగా ఈ రోజో, రేపో ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. ఈటలకు రాష్ట్ర బిజెపి పగ్గాలు అప్పగించడం దాదాపు ఖరారైనట్లేనని పార్టీ నుంచి సంకేతాలు వస్తున్నాయి. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా పార్టీలో సంస్థాగత మార్పులు అనివార్యమని పేర్కొన్నారు. ఇంతకాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను మంత్రివర్గంలోకి తీసుకోవటంతో ఆయన స్థానంలో మరొకరిని జాతీయ అధ్యక్షుడిగా తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాఖకు కూడా బిజెపి ఛీఫ్ నియామకం జరగబోతుందన్నారు. దీంతో ఈటలకే ఆ పదవి అనేందుకు మరింత ఊతమిచ్చినట్లయ్యింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News