Sunday, September 8, 2024

కరోనాపై సిఎం కెసిఆర్ ఆరా

- Advertisement -
- Advertisement -

cm-kcr

 

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించేందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సిఎంతో భేటి అయ్యారు. సోమవారం సిఎం ఛాంబర్‌లో మంత్రి ఈటల ప్రత్యేకంగా కలసి కరోనా వైరస్ నియంత్రణ కోసం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మూడు పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో కరోనాపై మరింత అప్రమత్తంగా ఉన్నామని వైద్యమంత్రి సిఎంకు వివరించారు. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు, పాజిటివ్ వచ్చిన వారికి అందిస్తున్న చికిత్స వివరాలు, ఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి మంత్రి ఈటల చెప్పారు. ఇప్పటికే కరోనా నియంత్రణ కోసం అవసరమైన వస్తువులు, ఇతర సామాగ్రీని కొనుగోలు చేశామని ఈటల సిఎం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సౌకర్యాల వివరాలు సిఎం మంత్రిని అడిగి తెలుసుకున్నారు.

కరోనా వైరస్ ఇతర దేశాల నుంచి వచ్చే వారి నుంచే ప్రబలుతున్న కారణంగా ఎయిర్‌పోర్ట్‌లను దిగ్భందం చేసి ప్రతి వ్యక్తికి స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని సిఎం మంత్రిని ఆదేశించారు. అనంతరం సిఎం సూచనలు మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రొక్యూర్‌మెంట్ కమిటి హెడ్ శ్రీదేవి, డిఎంఇ రమేష్‌రెడ్డి, డిహెచ్ శ్రీనివాసరావు, టిఎస్‌ఎంఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా శ్రావణ్ లతో మంత్రి ఫోన్ లో మాట్లాడి కరోనా నియంత్రణ కోసం చేయాల్సిన మరిన్ని కార్యక్రమాలను సూచించారు.

ఈసందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ… ఐసొలేషన్ వార్డులలో ఉపయోగించే 50 వేల ఎన్ 95 మాస్క్‌లను , 25వేలు పర్సనల్ ప్రోటెక్షన్ పరికరాలు, లక్ష హ్యాండ్ గ్లౌజులు, రెండు లక్షల ట్రిపుల్ లేయర్ మాస్కులు కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా పిహెచ్‌సిల్లో కూడా అవసరమైన సానిటైజర్‌లు, చికిత్సకు సరిపోయేంత మందులను అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. ఇప్పటికే విమానాశ్రయంలో థర్మోస్కానర్లు ఏర్పాటు చేశామని , ఒక్క స్క్రీనింగ్ చేయకుండా ఒక్కరిని కూడా బయటకు పంపడం లేదని మంత్రి తెలిపారు. మార్కెట్లో కంటే అతి తక్కువ ధరతో, నాణ్యమైన మాస్కులను కొనుగోలు చేయాలని ప్రొక్యూర్ మెంట్ చైర్మన్ శ్రీదేవిని, టిఎస్‌ఎంఐడిసి ఎండి చంద్రశేఖర్‌రెడ్డిని మంత్రి కోరారు.

గాంధీ ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డులోకి ఎవరు వెళ్లవద్దు.. మంత్రి ఈటల
గాంధీ ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డులో ఎవరకు వెళ్లవద్దని మంత్రి ఈటల సూచించారు. సాధారణ వ్యక్తులు వెళ్లకుండా దారులన్నీ మూసివేయాలని మంత్రి ఆసుపత్రి అధికారులకు తెలిపారు. ఐసొలేషన్ వార్డులో పనిచేయడానికి మూడు షిప్టుల్లో సరిపోయేంత సిబ్బంది, వారికి కావాల్సిన వ్యక్తిగత భద్రత కిట్స్, శానిటైజర్స్, మాస్కులు అందించాలని మంత్రి సూపరింటెండెంట్‌కి చెప్పారు. అదే విధంగా పేషెంట్‌లకు అన్నిసౌకర్యాలు కల్పించాలని, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేలా, వార్డు పరిసర ప్రాంతాల్లో దోమలు, ఈగలు లేకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు. దీంతో పాటు రోగికి నిత్యం పరిశుభ్రమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.

Etela Rajender met with CM KCR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News