మూసీ ప్రక్షాళనకు బిజెపి వ్యతిరేకం కాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కానీ మూసీలో పారాల్సింది మురికి నీరు కాదు, తాగే నీరు పారాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని భావన కాలనీలో ఆదివారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనను తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని అన్నారు. ఇల్లు కూలగొట్టి పెద్దలకు, కార్పొరేట్ కంపెనీలకు ఆ భూములు కట్టబెట్టే ఆలోచనను మేము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాని మరిచి ప్రజల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి విషయాల్లో ప్రజల తరఫున తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రజలను ఏమన్నా ఫర్వాలేదనుకుంటే పొరపాటని చెబుతూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కొడితే ఏమైపోయారో చూశారని అన్నారు. వీళ్ళని కొట్టే రోజులు కూడా ఎక్కువ దూరంలో లేదన్నారు. ఇంకా నాలుగు సంవత్సరాలు పాలన చేసే అవకాశం ఉంది, ప్రజల కోసం మంచి చేసే ప్రయత్నం చేయాలని అన్నారు. దేశ సమగ్రత, అభివృద్ధి, ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద నిలవాలంటే ప్రధాని మోడీకి మరింత బలం చేకూర్చాలన్న సంకల్పం దేశవ్యాప్తంగా చూస్తున్నామని తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మనకి పడ్డ ఓట్లలో 50 శాతం సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు అందరూ కృషి చేయాలని కోరారు.