హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి జరుగనున్నాయని, ఇందులో బిఏసి సమావేశాలకు బిజెపి పార్టీని కూడా ఆహ్వానించాలని బిజెపి హుజూరాబాద్ ఎంఎల్‌ఏ, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ పార్టీ అయిన బిజెపిని కూడా 5 గురు ఎంఎల్‌ఏలు కూడా లేదని, కేవలం ముగ్గురు సభ్యులే ఉన్నారని గతంలో బిఎసి సమావేశాలకు పిలువలేదని ఈటెల అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాలకు పిలిచేవారని ఈటెల అన్నారు. అసెంబ్లీ అంటేనే మా హక్కులను కాలరాస్తూ…మమ్మల్ని అసెంబ్లీ నుంచి బయటికి గెంటివేస్తున్నారని, ఈ సారి అలా చేయవద్దని ఎంఎల్‌ఏ ఈటెల రాజేందర్ అన్నారు.
బుధవారం నాడిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా సర్కారును ఎండగడతానన్నారు. కరెంటు కోతలు లేని తెలంగాణ అని బిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారని, వ్యవసాయానికి ఎక్కడా కూడా 24 గంటల కరెంటునే ఇవ్వడం లేదన్నారు. ఏసిడి పేరుతో విద్యుత్ బిల్లులు రాక ముందే జనం భయపడి పోతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని పంపులు మునిగిగాయే.. ఎంత నష్టం వచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని లేదంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తమ పార్టీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
317 జిఓపై ప్రభుత్వం స్పష్టంగా ముందుకు వెళ్తోందని, కానీ దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన చేస్తుంటే వాళ్లపై ఉక్కు పాదం మోపుతున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణపై ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. తాను హుజూరాబాద్‌లో గెలిచి 13 నెలలు అయినా.. తనను ఒక్క అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సర్కారు ఎంతో గొప్పలు చెబుతోందని, కానీ అక్కడ పలు మోటార్లు మునిగి పోయాయన్నారు. దీనిపై సమాచారం తెలుసుకునేందుకు ప్రాజెక్టు వద్ద నిష్ణాతులైన ఇంజనీర్లు అడుగుపెట్టే పరిస్థితే అక్కడ లేదన్నారు. ఇలాంటి అంశాలన్నీ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు.