Tuesday, September 17, 2024

హామీలు అమలు చేయకుండా..ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటావ్?:ఈటల

- Advertisement -
- Advertisement -

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటావని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బిజెపి మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ ఘాటుగా విమర్శించారు. హైడ్రా పేరుతో హడావుడి చేస్తూ హైడ్రామా చేస్తోందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. శుక్రవారం నాగోల్‌లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదుపై వర్క్ షాప్‌లో పాల్గొన్న ఈటల మాట్లాడుతూ హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తానంటే అది మీ తరం కాదని, పేదల జోలికి వస్తే కబడ్దార్ అని హెచ్చరించారు. నిజంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే పనే చేయాలంటే ముందుగా బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు నిర్మించి ఇచ్చి అప్పుడు కూల్చి వేయాలన్నారు. అంతే తప్పు ఆరు గ్యారెంటీల హామీలపై చర్చ జరగకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూస్తామని హెచ్చరించారు. ఇవాళ మీరు తప్పించుకోవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదన్నారు.

మీరు రెడ్ బుక్ రాస్తున్నానని గతంలో చెప్పావు, బీజేపీ తరపున మేము కూడా నీ చిట్టా అంతా రాసుకుంటున్నామని సందర్భం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని పేర్కొన్నారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు కామెంట్స్ చూస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎంత బాధ్యతా రహిత్యంగా, సంస్కారహీనంగా మాట్లాడుతున్నారో అర్థమవుతున్నదని అన్నారు. ఈ ఏడాది, వచ్చే ఏడాది అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయని పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అనుభవం కలిగిన పెద్ద లీడర్లు సైతం లోకల్ బాడీ ఎన్నికల పోటీలో ఉండబోతున్నారని రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని జేపీ నడ్డా, అమిత్ షా సైతం ఇదివరకే చెప్పారని అందువల్ల పార్టీ సభ్యత్వ నమోదు ప్రాముఖ్యతను అన్ని మోర్చాలు గుర్తించాలని సూచించారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలన చూశామని వీరిని భరించే స్థితిలో లేమని బీజేపీనే గట్టిగా పోరాటం చేయాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో వెలిసిపోవడానికి ఐదేళ్లు పడితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం తొమ్మిది నెలలు కూడా పట్టలేదన్నారు. 2018 నాటికే కేసీఆర్‌ను ప్రజలు చీదరించుకున్నా ప్రయత్యామ్నాయం లేక పోపోవడంతో మరో సారి గెలిచారని ఆయన విమర్శించారు. అధికార పార్టీ కావడంతోనే గత స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News