Saturday, September 28, 2024

సిఎం రేవంత్‌రెడ్డి ఒక్క మాటా నిలబెట్టుకోలేదు:ఈటల

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఒక్క మాటా నిలబెట్టుకోలేదని మల్కాజ్‌గిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ విమర్శించారు. ఆయన టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సర్పంచ్‌లకు న్యాయం చేస్తానని చెప్పి ఇప్పుడు సిఎం అయ్యాక వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు బుధవారం జరిగాయి. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచులు, గ్రామ పంచాయతీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తుందని రేవంత్ రెడ్డీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడారని, బిల్లులు రాక 60 మంది సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని అప్పుడు రేవంత్ అన్నారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్పంచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయనని పలకరించిన నాథుడే లేడని వాపోయారు. అడ్డదారులు తొక్కి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న సర్పంచ్‌ల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దసరాలోపు పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయాలని ఈటల డిమాండ్ చేశారు. లేకుంటే మిమ్మల్ని ఎక్కడికి అక్కడ అడ్డుకునేందుకు సర్పంచ్‌లు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. సర్పంచ్‌ల ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, సర్పంచ్ ల పదవి కాలం పూర్తయ్యి ఏడు నెలలు దాటినా ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. పాలక మండలి లేక గ్రామాల్లో చెత్త పేరుకుపోతోందని, రేవంత్ గ్రామాలను వల్లకాడుగా మార్చారని ఆరోపించారు. వెంటనే రిజర్వేషన్లు ప్రకటించి సర్పంచ్ ఎన్నికలు జరపాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News