Monday, November 18, 2024

పోడు భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారు?:ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

ఇంద్రవెల్లి: అధికారంలోకి రాగానే అడవి బిడ్డలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు అందిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఊసెత్తకపోవడం శోచనీయమని మాజీ మంత్రి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప బస్సు యాత్ర గురువారం ఆదిలాబాద్ జిల్లాకు చేరింది. గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఇంద్రవెల్లిలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ…ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గోండు గిరిజనుల గోస పుచ్చుకోకుండా వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. తొలుత గుడిహత్నూర్‌లో బస్సు యాత్రకు జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ముఖ్య నేతలు ఈటలకు ఘన స్వాగతం పలికారు.

గత ప్రభుత్వం కొండ నాలుకకు మందు పెడతామని చెప్పి, ఉన్న నాలుక ఊడబీకిందని, పోడుపట్టాలిస్తామని నమ్మించి 13 కాలంలు తొలగించి, ఆదివాసుల హక్కులు కాలరాసిందని ధ్వజమెత్తారు. పోడు పట్టాల పేరిట గత పాలకులు కమిటీల మీద, కమిటీలు వేసి కాలయాపన చేశారని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో గిరిజన ఇతరుల హక్కులు కూడా కాపాడాలని, వారికి రైతుబంధు, పంట సాగుకు రుణాలు అందించాలని కోరారు. ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా గ్యారంటీలను కాంగ్రెస్ సర్కార్ మర్చిపోయిందని విమర్శించారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు రూ.2500, సకలంగులు, వికలాంగులకు 4 వేల పింఛన్లు, రైతులకు రుణ మాఫీ వెంటనే అమలు చేయాలన్నారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం ఇంకా ఆరు నెలలు ఓపిక పడతామని, ఆ తర్వాత ప్రభుత్వానికి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసిందని, ముఖ్యమంత్రి తరచూ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ,

అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్ద అప్పులు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. జీతాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందని, గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్రం నిధులు ఇచ్చి ఆదుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎంసి సోయం బాపూరావు మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రపంచ దేశాలను ప్రధాని మోడీ ఆదుకున్నారని అన్నారు. గిరిజనుల హక్కుల కోసం కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, ఎంఎల్‌ఎ పాయల్ శంకర్, మాజీ ఎంపి రమేశ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News