Monday, December 23, 2024

రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వం: ఈటల

- Advertisement -
- Advertisement -

వరంగల్ : ఈ నెల ఎనిమిదిన వరంగల్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వస్తున్నందున దేశ స్థాయిలో వరంగల్‌లో బిజెపి పార్టీ శ్రేణులతో కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతామని బిజెపి ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోడీ వరంగల్ బహిరంగ సభ నిర్వహణ ఇన్‌చార్జ్‌గా వరంగల్‌కు గురువారం వచ్చిన సందర్భంగా వరంగల్ తూర్పా నియోజకవర్గ బిజెపి ఇన్‌చార్జ్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగరవేయాలన్న లక్షంతో తెలంగాణ రాష్ట్రానికి వరాల జల్లును కురిపించారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వరంగల్ రీజియన్‌ను తెలంగాణ రాష్ట్రానికి గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వే మ్యాన్‌ప్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రధానమంత్రి మోడీ మంజూరు చేసి ఈ ప్రాంత వాసుల చిరకాల కోరికను తీర్చారని అన్నారు.

వరంగల్‌లో చారిత్రాత్మకంగా ఉన్న అజాంజాహి మిల్లు స్థానంలో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీకి ఇక్కడి నేతలు చెప్పిన కోరికను స్పందించి మెగా టెక్స్‌టైల్‌ను మంజూరు చేశారని అన్నారు. దేశంలో జాతీయ రహదారులు గతంలో 2400ల కిలోమీటర్ల వరకు ఉంటే నేడు వాటిని విస్తృతపర్చడం జరిగిందన్నారు. రామగుండం నుండి వరంగల్ మీదుగా వెళ్లే నాలుగు లైన్ల రోడ్డును మంజూరు చేశారని అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో బిజెపి ప్రభుత్వం ప్రజల అవసరాల మేరకు చేసి చూపిస్తుందని, ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అన్నారు. ఈ మూడు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి మోడీ జూలై 8న శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. ఉదయం 9.25నిమిషాలకు షెడ్యూల్ ప్రకారం రావడం జరుగుతుందన్నారు. అన్ని షెడ్యూల్ ప్రకారమే జరగనున్నందున వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో బిజెపికి పట్టున్నందున వరంగల్ జిల్లా కార్యకర్తలు సమయం ప్రకారం సభా స్థలికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ఆరాటపడుతుందని అన్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలను గెలుచుకొని తన సత్తాను చాటుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితిలో ఉండిపోయిందన్నారు. రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని చెప్పారు. ప్రధాన పోటీ బిఆర్‌ఎస్, బిజెపి మధ్యనే ఉండనుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా జాతీయ పార్టీగా ఉన్న బిజెపికే మద్దతు చేస్తే కేంద్ర, రాష్ట్రాల్లో అభివృద్ధి గణనీయంగా జరుగుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలతో ప్రజలకు ఒరిగేదేమి లేదన్నారు. బిజెపిపై ఇటీవల మీడియా వ్యక్తులు, సంస్థలు కావాలని కొన్ని రకాల దుష్ప్రచారాలు చేస్తున్నారని, వాటన్నింటిని ఖండిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాలు ఇచ్చిన పార్టీ ఆదేశాల మేరకు క్రమశిక్షణతో నాయకత్వం ముందుకు పోతుందని అన్నారు.

ఎవరెవరూ ఏదో చేస్తున్న ప్రచారాలు వేరు, బిజెపి సిద్దాంతంతో ఒక లక్షంతో ముందుకు పోతుందని తెలిపారు. ఆ లక్ష సాధనలోనే తామంతా పని చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు చోటు దక్కదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News