హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియూ) భూముల జోలికి వస్తే ఖబర్ధార్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఆ భూములకు తాము రక్షణగా ఉంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ఢిల్లీలో బుధవారం భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులంతా ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు సంఘీభావంగా బిజెపి శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీకి వచ్చారు. అంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల బలిదానంతో వచ్చిన భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 1969లో మా రాష్ట్రం మాకు కావాలని తెలంగాణ సమాజం, విద్యార్థిలోకం ఆనాడు ఉద్యమాలు చేసిందని తెలిపారు.
369 మంది విద్యార్థులను ఆనాటి ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని గుర్తు చేశారు. ఆ విద్యార్థుల త్యాగ ఫలితంగా 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగిందని ఈటల గుర్తు చేశారు. విశ్వవిద్యాలయం కోసం 2500 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు అమ్మకపోతే ఒక్క రోజు కూడా ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదని చెప్పి యూనివర్సిటీ భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు. 400 ఎకరాల భూమిని 40 వేల కోట్లకు అమ్మి సర్కారు నడపాలనే సిగ్గుమాలిన పనికి రేవంత్ రెడ్డి సర్కార్ ఒడిగట్టిందని దుయ్యబట్టారు. యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు ఇందుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఒక పక్క ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్లు కట్టడానికి కనీసం స్మశాన వాటికలకు కూడా హైదరాబాద్‌లో స్థలం దొరకడం లేదని,
ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారవద్దు కాంక్రీట్ జంగిల్‌గా హైదరాబాద్‌ను చేయవద్దని విద్యార్థులు మొక్కవోని ధైర్యంతో ఆందోళన చేస్తుంటే వారి మీద ప్రభుత్వం పోలీసుల్ని ఉసిగొల్పి దాడులు చేసి విద్యార్థుల రక్తం కళ్ల చూస్తున్నారని మండిపడ్డారు. వందల బుల్డోజర్లతో చెట్లను కూల్చివేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు.