Monday, January 20, 2025

మొయిత్రా ఎంపిత్వంపై వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టిఎంసి ఎంపి మహువా మొయిత్రాను లోక్‌సభ సభ్యత్వంపై వేటుకు ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ ఎంపి వ్యాపారవేత్తల నుంచి భారీగా ముడుపులు తీసుకుని లోక్‌సభలో నిర్థిష్ట ప్రశ్నలకు దిగారని ఆమెపై క్యాష్ ఫర్ క్వెరీ అభియోగాలు వెలువడ్డాయి. దీనిపై సంబంధిత ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. 500 పేజీల నివేదిక అందించింది. ఆమె తీవ్రస్థాయిలో సభా హక్కులను గౌరవమర్యాదలను ఉల్లంఘించారని, ఆమె వ్యవహారశైలి చివరకు దేశ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టిందని ఎథిక్స్ కమిటీ అభిప్రాయపడింది. ఆమెను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హురాలిగా ప్రకటించాలని సిఫార్సు చేశారు. ఓ ఎంపిపై అనర్హత వేటుకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేయడం ఇదే తొలిసారి అయి ఉంటుందని లోక్‌సభ సచివాలయం మాజీ సెక్రెటరీ జనరల్ పిడిటి ఆచారి తెలిపారు. ఈ ఎథిక్స్ కమిటీకి బిజెపి ఎంపి వినోద్ కుమార్ సొంకర్ నాయకత్వం వహిస్తున్నారు.

కమిటీ గురువారం సమావేశం అయ్యి, మొయిత్రా బహిష్కరణకు సిఫార్సు చేసే నిర్ణయం తీసుకుంది. తరువాత కమిటీ ఛైర్మన్ సోంకర్ విలేకరులతో మాట్లాడారు. కమిటీలోని ఆరుగురు సభ్యులు ఈ సిఫార్సుకు ఆమోదం తెలిపినట్లు, నలుగురు వ్యతిరేకించినట్లు వివరించారు. కమిటీ నిర్ణయం పూర్తిగా దురుద్ధేశపూరితం, అనుచితం అని ప్రతిపక్షానికి చెందిన నలుగురు సభ్యులు విమర్శించారు. అయితే కమిటీలోని కాంగ్రెస్ సభ్యులు ప్రీనీత్ కౌర్ నివేదికకు మద్దతుగా ఉన్నారని తరువాత వెల్లడైంది. మొయిత్రా సభ్యత్వ రద్దుకు కమిటీ సిఫార్సు చేసిన విషయాన్ని పార్లమెంట్ అధికార వర్గాలు కూడా నిర్థారించాయి. ఎంపి సభ్యత్వ రద్దు సిఫార్సును స్పీకర్ ఓం బిర్లాకు పంపించడం జరుగుతుంది. తరువాత దీనికి అనుగుణంగా స్పీకర్ ఈ అనర్హత వేటు విషయాన్ని అధికారికంగా వెల్లడించడం జరుగుతుందని ఇది ఇప్పటివరకూ ఉన్న పద్ధతి అని మాజీ అధికారి వివరించారు. కాగా వచ్చే పార్లమెంట్ సెషన్‌లో ఎథిక్స్ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెడుతారు.

దీనిపై చర్చ ఉంటుంది. ఎంపిపై వేటుకు సంబంధించి ప్రభుత్వం తీర్మానం తీసుకురావల్సి ఉంటుంది. ఇది నెగ్గితే ఎంపి సభ్యత్వం రద్దు అయినట్లు అవుతుంది. దీనిని ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఎథిక్స్ కమిటీ ఈ ఎంపిపై అభియోగాలు గురించి పలు సార్లు విచారణ జరిపింది. ఆరోపణలకు గురైన మొయిత్రాను, ఆమెపై ఆరోపణలకు దిగిన బిజెపి ఎంపి నిశికాంత్ దూబేను, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌ను విచారించింది. తనకు లాయరు ద్వారా అందిన సమాచారం మేరకు ఈ టిఎంసి ఎంపి లోక్‌సభలో తరచూ అదానీ కంపెనీ వ్యవహారాలపై ప్రశ్నలు వేశారని , ప్రముఖ వ్యాపారి దర్శన్ హీరానందని నుంచి భారీగా ముడుపులు తీసుకుని అదానీపై, ప్రధాని మోడీపై ప్రశ్నలు అడిగేందుకు ఈ ఎంపి తన సభ్యత్వాన్ని వాడుకున్నారని బిజెపి ఎంపి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News