Friday, December 20, 2024

మత మౌఢ్యం మాటున డబుల్ ఇంజిన్ సర్కార్..!

- Advertisement -
- Advertisement -

దేశంలో ఏదో ఒక చోట ఏదో ఒక ఆరని చిచ్చు రగులుకుంటూనే వుండాలని భావించే ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి శక్తులు పాతబడిన పాకిస్థాన్, కశ్మీర్ సమస్యలతో ఇక లాభం లేదని ఆదివాసీల చిచ్చు రగిలిస్తున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తాము అధికారంలో వున్న రాష్ట్రాల్లో కూడా హింసను రెచ్చగొడుతున్నారు. మే నెలలో మణిపూర్ మైదాన ప్రాంతంలో మెజారిటీ మెయితీ జాతికి ఆదివాసీ హోదా కల్పిస్తామన్న హామీ ఇచ్చి వారికి, అటవీ ప్రాంతాలలో వుండే కుకీ, నాగా ఆదివాసీల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టారు. అప్పటి నుంచి మణిపూర్‌ని ఆరని జ్వాలలా మండిస్తూనే వున్నారు. అక్కడున్న తెగల మధ్య విద్వేష పూరిత ఘర్షణలను పెంచి పోషిస్తున్నారు. భారత రాజ్యాంగంలోని 371సి, మణిపూర్ భూసంస్కరణల చట్టం 1960 లోని సెక్షన్ 158 ప్రకారం గిరిజనులకే చెందుతాయని, మెయితీలతో పాటు గిరిజనేతరులకు బదిలీ చేయకూడదనే సింగిల్ పాయింట్ ఏజెండాతో కుకీ తెగ వ్యతిరేకిస్తూ వస్తోంది. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం 1901 గిరిజనులుగా గుర్తించింది. తిరిగి 1931లో హిందూ గిరిజనులుగా గుర్తించారు.

కానీ, 1950 నుంచి వాళ్ళను గిరిజనులుగా పరిగణించడం లేదు. ఇదే అంశంపై మణిపూర్ హైకోర్టును ఆశ్రయించగా మెయితీలను గిరిజనుల్లో చేర్చే అంశాన్ని నాలుగు వారాల్లోగా పరిశీలించాలని, కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని హైకోర్టు ఆదేశించింది. గొడవలకు కారణం అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే వుంటే ఈ ఘటనను సుమోటోగా తీసుకుంటామని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. గిరిజన బిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆదివాసీ మహిళగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాత్రం ఇంకా స్పందించ కపోవడం గమనార్హం. మే 3వ తేదీ నుంచి రెండు తెగల మధ్య మారణకాండ కొనసాగుతున్న క్రమంలో తలదాచుకోవడానికి, ప్రాణాలు కాపాడుకునేందుకు అడవిలోకి వెళ్లేందుకు సిద్ధమైన క్రమంలో మే 4న గ్రామంపై మెయితీలు గుంపుగా వచ్చి దాడి చేస్తుండగా అక్కడే ఉన్న పోలీసులను ఆశ్రయించడం జరిగింది. దానితో గిరిజనుల బతుకు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది. మణిపూర్‌లోని కాంగ్ ఫోక్సీ జిల్లాలో కుకీ తెగకు చెందిన ఇద్దరు ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మణిపూర్‌లో మహిళలపై సాగుతున్న అఘాయిత్యాలు వెలుగులో కొచ్చాయి.

ఈ ఘటనలో ఆ మహిళలపై సామూహిక లైంగిక దాడికి కూడా పాల్పడ్డారు. ఆ మహిళల కుటుంబ సభ్యులను హత్యలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. భయభ్రాంతులకు గురి చేయడానికి తీసిన వీడియో వెలుగులోకి రాకుండా, బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్ సౌకర్యం తొలగించి జాగ్రత్తలుపడ్డారు. సరిగ్గా రెండు నెలల తర్వాత ఈ అమానవీయమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మణిపూర్ మారణకాండకు మత మౌఢ్యం ప్రేరేపణ ప్రధాన కారణం అయింది. ఈ మారణ హోమం పై ఇన్నాళ్లు స్పందించని ప్రధాని మోడీ 79 తొమ్మిది రోజుల తర్వాత ఆయన తీరు మొసలి కన్నీరు కారుస్తూ ఇన్నాళ్లు ఏం తెలియదన్నట్టుగా నిందితులు దొరికితే ఉరి తీయాలంటున్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు ఉంది. మణిపూర్‌లో తెగల మధ్య గొడవలకు ఆజ్యం పోసింది ముమ్మాటికీ సంఘ్ పరివార్‌దే. మెయితీలకు ప్రభుత్వం దొంగచాటుగా ఆయుధాలు అందజేసింది. మిలిటరీ, పోలీసు బెటాలియన్స్‌ల ఆయుధ గారాలను బార్ల తెరిచింది. అక్కడున్న సిబ్బందికి మెయితీలు దోచుకునేలా వెసులు బాటు కల్పించాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయనే విమర్శ ఉంది.

అధికారిక లెక్కల ప్రకారం యాభై వేల తుపాకులు, బస్తాల కొద్దీ బుల్లెట్లు, గ్రనేడ్లు, అత్యాధునిక ఆయుధాలు మెయితీల చేతుల్లోకి చేరాయి. ఈ గొడవలకు బిజెపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని ఉంటే ఈ మారణహోమం కొద్ది రోజుల్లోనే ఆగిపోయేది. అమాయకుల మాన ప్రాణాలు క్షేమంగా ఉండేది. మణిపూర్‌లో బాధిత నాగాలకు, కుకీలకు ప్రభుత్వపరంగా గాని, భద్రతాపరంగా గాని ఎవరైనా సహాయంగా నిలబడ్డారు అంటే అది అసోం రైఫిల్స్ పారా మిలిటరీ బలగాలు. అసోం రైఫిల్స్‌లోని భద్రతా సిబ్బంది అంతా ఈశాన్య ఏడు రాష్ట్రాల నుంచే రిక్రూట్ అవుతారు కాబట్టి మెయితీ అల్లర్ల గుంపు దాడులు నుంచి తప్పించుకొని తల దాచుకోవడానికి అల్లాడుతున్న కుకీ, నాగాలకు రక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి, సైనికులు ఒక పూట పస్తులుండి బాధితులకు రెండు పూటలా కడుపు నిండా తిండి పెట్టారనే ప్రచారం జరుగుతున్నది. మణిపూర్ ఘటనను అత్యంత క్రూరమైన, భయంకరమైన ఘటనగా అగ్రరాజ్యం అమెరికా అభివర్ణించింది.

మణిపూర్ ప్రజల మధ్య చిచ్చు రగిలించిన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం, సిగ్గు లేకుండా ఇలాంటి సంఘటనలు కోకొల్లలు అంటూ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకొనేలా చేస్తున్నాయి. అసలు బీజేపీ ప్రభుత్వం కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించి ఉంటే ఈ రోజు మనం ఈ ఘోరాలను చూసి ఉండేవారం కాదని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News