రెండు అంశాలపై అస్పష్టత
న్యూఢిల్లీ : ఆఫ్రికా దేశం గాంబియాలో దగ్గుమందు కలకలం భారతదేశంలోని ఔషధ పరిశ్రమంలో కలవరానికి దారితీసింది. భారత్‌కు చెందిన మైడెన్ ఔషధ సంస్థ ఉత్పత్తి అయిన సిరప్ గాంబియాలో 66 మంది పిల్లల మరణానికి దారితీసింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసి, భారత్‌ను అలర్ట్ వెలువరించింది. డబ్లుహెచ్‌ఒ అలర్ట్ ఆషామాషీ కాదని, అయితే సిరప్ ఘటనకు సంబంధించి కొన్ని లొసుగులు ఉన్నాయని, వీటి గురించి దర్యాప్తు చేయాల్సి ఉందని ఫార్మాస్యూటికల్ నిపుణులు ఒకరు తెలిపారు. నాలుగు రకాల సిరప్‌లు పూర్తిగా కలుషితం , నాసిరకంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ సిరప్‌లలో ఇథెలిన్ గ్లైకాల్ ఉందని దీని వల్లనే పిల్లలు మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ అలర్ట్‌లో పేర్కొన్న విషయాన్ని సీనియర్ ఫార్మాకాలిజిస్టు, ఔషధాలపై స్థాయి సంఘం ( ఎన్‌ఎన్‌సిఎం) ఉపాధ్యక్షులు వైఎస్ గుప్తా శనివారం ప్రస్తావించారు. పిల్లల మృతి సిరప్ వాడకానికి సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టత లేదని, దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాల్సి ఉందని ఆయన తెలిపారు. సాధారణంగా కొత్త సిరప్ లేదా ఔషధం తయారయితే సంబంధిత ఉత్పత్తికి అనుమతిని డిసిజిఐ మంజూరు చేస్తుంది.
ఇక తయారీకి లైసెన్సు విషయాన్ని రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ చూసుకుంటారు. అయితే ఈ సిరప్ విషయంలో ఉత్పత్తి, అమ్మకాల అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం (ఢిల్లీ ప్రభుత్వం) ఇచ్చింది. ఇది ఏ విధంగా జరిగింది? ఇక మరో ముఖ్య విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన 22 శాంపుల్స్‌ను పరీక్షించగా వీటిలో కేవలం నాలుగు శాంపుల్స్‌లోనే ప్రమాదకర రీతిలో ఇథైలైన్ గ్లైకాల్ ఉన్నట్లు నిర్థారించారని డాక్టర్ గుప్తా తెలిపారు. సంబంధిత అంశంపై అస్పష్టత ఉందని , దీనిపై వివరణ అవసరం అని పేర్కొన్నారు. భారతదేశ ఔషధ పరిశ్రమకు విశేష ఖ్యాతి ఉందని, విశ్వసనీయత పరిరక్షణ విషయంలో జాతీయ స్థాయిలో ఉండే నిబంధనల విషయంలో రాజీ లేదని పేర్కొన్న గుప్తా, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తలెత్తిన సిరప్ వివాదంపై వెంటనే జాగ్రత్తగా స్పందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.