వ్యాక్సిన్లపై ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపణ
బ్రస్సెల్స్: కొవిడ్19 వ్యాక్సిన్ల విషయంలో తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆస్ట్రాజెనెకా ఔషధ కంపెనీ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ యూరోపియన్ యూనియన్(ఇయు) బ్రస్సెల్స్(బెల్జియం) కోర్టులో దావా వేసింది. ఇయు దేశాలకు సరఫరా చేయాల్సిన వ్యాక్సిన్ డోసుల్ని బ్రిటన్, ఇతర దేశాలకు దారి మళ్లించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఇయులోని 27 దేశాల తరఫున కార్యనిర్వాహక బాధ్యతలు నిర్వహించే యూరోపియన్ కమిషన్‌తో ఆస్ట్రాజెనెకా ఒప్పందం చేసుకున్నది. దాని ప్రకారం మొదటి విడతలో ఇయు దేశాలకు 30 కోట్ల డోసుల్ని ఆస్ట్రా సరఫరా చేయాలి.
ఆ తర్వాత మరో 10 కోట్ల డోసుల్ని సరఫరా చేయాలి. 2021 ఏడాది చివరికల్లా ఈ సరఫరాలు జరగాలన్నది ఒప్పందమని ఇయు చెబుతోంది. కాగా, మొదటి త్రైమాసికంలో 3 కోట్లు, రెండో త్రైమాసికంలో 7 కోట్లు మాత్రమే ఆస్ట్రాజెనెకా సరఫరా చేసిందని ఇయు తెలిపింది. ఒప్పందం ప్రకారం 18 కోట్లు సరఫరా చేయాలని ఇయు తెలిపింది. ఇదిలా ఉండగా ఇతర కంపెనీలతోనూ ఇయు ఒప్పందాలు చేసుకున్నది. మొత్తమ్మీద ఇయు దేశాలకు ఇప్పటికే 30 కోట్ల డోసుల టీకాలందాయి. వాటిలో 24.50 కోట్ల డోసుల్ని ఆయా దేశాల పౌరులకు పంపిణీ చేశారు. ఇయు దేశాల మొత్తం జనాభా దాదాపు 45 కోట్లు. ఇప్పటికే ఆ దేశాల్లోని ప్రజలకు 46శాతంమేర కనీసం ఒక్క డోసు అందింది. దాంతో, ఇయు దేశాల్లో కొవిడ్19 కేసులు తగ్గుముఖం పట్టాయని పరిశీలకులు తెలిపారు.