Saturday, December 28, 2024

రష్యాపై ఐరోపా చమురు వార్..

- Advertisement -
- Advertisement -

Europe Crude Oil war on Russia

రష్యాపై ఐరోపా చమురు వార్
90 శాతం క్రూడ్ దిగుమతుల నిలిపివేత
రెండురోజుల మంతనాలలో నిర్ణయం
ఓ వైపు ఇంధన అవసరాలు
మరో వైపు మాస్కోకు షాక్ వ్యూహాలు
విభేదాల నడుమనే ఇయూ స్పందన
బ్రస్సెల్స్: రష్యాపై యూరోపియన్ యూనియన్ (ఇయూ) తమ వాణిజ్యదౌత్య యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. రష్యా చమురు దిగుమతులపై90 శాతం కోత విధించాలని 27 దేశాలతో కూడిన ఐరోపా సమాఖ్య నిర్ణయించింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ స్థాయిలో రష్యా చమురుపై కోత అమలులోకి వస్తుంది. రష్యా ముడిచమురు నిషేధంపై అత్యధిక మెజార్టీతో ఏకాభిప్రాయానికి వచ్చింది. అయితే అంతకుముందు సంబంధిత విషయంపై జరిగిన వాదోపవాదాల క్రమంలో ఇయూ ఐక్యతలో ఉన్న చీలికలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఇయూ ఖండిస్తూ వస్తోంది. ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచింది. ఈ క్రమంలోనే రష్యాతో వాణిజ్య ఆంక్షలకు తెరతీసింది. రష్యాకు అత్యంత లాభదాయకమైనది ఇంధన రంగం. దీనిని దెబ్బతీసే విధంగా సంఘటితంగా వ్యవహరించాలని ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభమైన ఫిబ్రవరి 24 నాటి నుంచే అమెరికా, బ్రిటన్ ఇతర దేశాలు సంకల్పించాయి. రష్యా ఇంధన రంగాన్ని బలహీనపర్చడం ద్వారా యుద్ధానికి అవసరం అయిన నిధులను ఆటంకపర్చాలని ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇంధన దిగుమతిపై తీవ్రస్థాయి నిర్ణయానికి ఇయూ దేశాల సమావేశాలు జరిగాయి. ఇంధన విషయంలో ఎటువంటి కీలక నిర్ణయం అయినా కత్తిమీద సాము అవుతుంది. ప్రత్యేకించి యూరప్ అత్యధికంగా రష్యా చమురు వనరులపైనే ఆధారపడుతోంది. తమ వినియోగంలో చమురు విషయానికి వస్తే పాతిక శాతం వరకూ రష్యా నుంచి తెప్పించుకోవాలి.
పైప్‌లైన్ సరఫరాలు సాగుతాయి
రష్యా నుంచి పలు దేశాలకు పైప్‌లైన్ల ద్వారా అందే ముడిచమురు సరఫరాలు ప్రస్తుతానికి కొనసాగుతాయి. అయితే సముద్ర మార్గంలో రవాణా నౌకల ద్వారా వచ్చే కోటాలు నిలిచిపోతాయి. ఇప్పటి నిర్ణయంతో రష్యా నుంచి దాదాపు 69 శాతం చమురు సరఫరా ఆగిపోతుందని సమాఖ్య కౌన్సిల్ చీఫ్ ఛార్లెస్ మిషెల్ తెలిపారు. అయితే పలు కారణాలు ప్రత్యేకించి సముద్ర మార్గం లేకపోవడంతో, కేవలం పైప్‌లైన్ల సరఫరాలపైనే ఆధారపడి ఉండటంతో రష్యా దిగుమతుల ఆంక్షల నుంచి హంగేరీని ఇయూ మినహాయించింది. రష్యా చమురు ఆంక్షల నుంచి తమను తప్పించాలని హంగేరీ ప్రధాని విక్టర్ ఆర్బాన్ చాలా కాలంగా కోరుతూ వస్తున్నారు.
రెండు రోజుల అత్యున్నత స్థాయి సమీక్ష
ఇక సహజవాయువుల విషయంలో దాదాపు 40 శాతం వరకూ రష్యా నుంచి అందే కోటాపైనే ఆధారపడాల్సి వస్తోంది. సోమవారం అర్థరాత్రిదాటే వరకూ సాగిన మంతనాల క్రమంలో రష్యా దిగుమతులలో అత్యధిక శాతం వరకూ కోత విధించాలని నిర్ణయానికి ఎట్టకేలకు వచ్చారు. వచ్చే ఆరు నెలల వరకూ ఈ దిగుమతుల నిలిపివేత నిర్ణయం అమలులో ఉంటుంది. బ్రస్సెల్స్‌లోని ఇయూ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరిగాయి. ఇక దిగుమతులపై ఆంక్షలతో తలెత్తే విషమ పరిణామాలను సమీక్షించుకునేందుకు మంగళవారం కూడా ఇయూ సమావేశాలు జరిగాయి. ఓ వైపు తమకు చమురు దిగుమతులపై చెల్లింపులను తమ రూబుల్స్ కరెన్సీలో చెల్లించాలని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు కొంత ఏర్పాటు కూడా జరిగింది. ఇప్పుడు ఇయూ పుతిన్ డిమాండ్‌ను తిరస్కరించింది. రష్యా అంతా ఏకపక్షంగా వ్యవహరిస్తే కుదరదని నెదర్లాండ్స్ వాణిజ్య సంస్థ గ్యాస్ టెర్రా తెలిపింది.
వారు కాకపోతే వేరు దారి: రష్యా
తమ చమురు దిగుమతులపై ఇయూ అత్యధిక శాతం నిషేధ నిర్ణయం తీసుకోవడంపై రష్యా స్పందించింది. వియన్నాలో అంతర్జాతీయ సంస్థలకు శాశ్వత రష్యా ప్రతినిధి అయిన మిఖాయిల్ యుల్యానోవ్ దీనిపై ట్వీటు వెలువరిస్తూ తమ దేశం ఇతర దిగుమతిదార్లను లెక్కలోకి తీసుకుంటుందన్నారు. రష్యా ఎప్పుడూ అంతర్జాతీయ ఇంధన సరఫరాలను నిలిపివేయలేదు. దీనిని బాధ్యతగా తీసుకుంది. పలు విధాలుగా నష్టాలు సంభవించినా కోటాలను పంపిస్తూ వస్తున్నామని తెలిపారు. ఇక తాము డచ్చ్ కంపెనీ గ్యాస్‌టెర్రాకు ఎగుమతులను నిలిపివేస్తున్నామని, ఇప్పటికే డెన్మార్క్, బల్గెరియా, పోలెండ్, ఫిన్లాండ్‌లకు సరఫరాలు ఆపివేశామని రష్యా ఇంధన దిగ్గజ కంపెనీ గాజ్ప్రూం ప్రకటించింది.
రష్యాకు ఏటా పదికోట్ల డాలర్ల నష్టం
యూరోపియన్ యూనియన్ తీసుకున్న చమురు ఆంక్షల ఫలితంగా రష్యాకు ప్రతి ఏటా 10బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే సముద్ర మార్గంలో వివిధ దేశాలకు తరలించిన రష్యా చమురు కూడా సరఫరా కాకుండా నిలిచిపొయే అవకాశాలు ఉన్నాయి.

Europe Crude Oil war on Russia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News