Sunday, January 19, 2025

ఐరోపా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

Europe faces many challenges: PM Modi

రేపు ప్రధాని యూరప్ పర్యటన

న్యూఢిల్లీ : ఐరోపా దేశాలు అనేక సవాళ్లతో సతమతమవుతున్న సమయంలో తాను డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నానని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. మే 2 నుంచి ఆయన ఐరోపా దేశాల్లో పర్యటిస్తారు. ఆదివారం ఆయన జర్మనీకి బయలుదేరుతారు. ఈ ఏడాది మోడీ తొలి విదేశీ పర్యటన ఇదే. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో యూరప్‌లో రాజకీయ పరిస్థితులు మారుతున్న సంగతి తెలిసిందే. శాంతి, సౌభాగ్యాల కోసం భారత్ అన్వేషిస్తోందని, దీనిలో ఐరోపా భాగస్వాములు చాలా ముఖ్యమైన సహచరులని తెలిపారు. అటువంటి యూరప్ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేసుకోడానికి తాను డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటిస్తున్నానని తెలిపారు. మోడీ పర్యటనలో ముందుగా మే 2 న జర్మనీ వెళ్తారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కౌల్జ్ తో బెర్లిన్‌లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు కలిసి ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసి)కు సహాధ్యక్షత వహిస్తారు. జర్మనీలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే ఈ ఐజీసి జరుగుతుండటం పట్ల మోడీ హర్షం ప్రకటించారు. మధ్యకాలిక, దీర్ఘకాలిక, ప్రాధాన్యాలను గుర్తించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. భారత్, జర్మనీ మంత్రులు కూడా చర్చలు జరుపుతారు.

మే 3 న డెన్మార్క్ లోని కొపెన్‌హాగన్‌లో మోడీ పర్యటిస్తారు. ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ నోర్డిక్ రెండో సదస్సులో ఆయన పాల్గొంటారు. ఐస్‌లాండ్ ప్రధాన మంత్రి కట్రిన్ జాకబ్స్‌డొట్టిర్, నార్వే పీఎం జోనాస్ గహ్ స్టోర్ , స్వీడర్ పీఎం మగ్ధలీనా అండర్సన్ , ఫిన్లాండ్ ప్రధాని సన్నమారిన్‌లతో కూడా చర్చలు జరుపుతారు. ఈ దేశాలనే నోర్డిక్ దేశాలంటారు. ఇండియా డెన్మార్క్ బిజినెస్ రౌండ్ టేబుల్‌లో పాల్గొంటారు. డెన్మార్క్ లోని భారత సంతతి ప్రజలను కూడా కలుస్తారు. మే 4 న స్వదేశానికి తిరిగి రావడానికి ముందు మోడీ ఫ్రాన్స్‌లో కాసేపు పర్యటిస్తారు. ఫ్రెంచి ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఫ్రాన్స్‌లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో మేక్రాన్ విజయం సాధించారు. ఈ ఫలితాలు వెలువడిన పది రోజుల్లోనే తాను ఫ్రాన్స్‌లో పర్యటించబోతున్నానని, మేక్రాన్‌ను వ్యక్తిగతంగా అభినందించే అవకాశం లభించిందని మోడీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత మైత్రి బలపడటానికి తన పర్యటన దోహదపడుతుందన్నారు.

ఇంధన భద్రతే ప్రధానాంశం : వినయ్ మోహన్ క్వాత్రా
మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఇంధన భద్రతే ప్రధానాంశమని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇంధన భద్రతకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా ఐరోపా నేతలతో ప్రధాని మోడీ జరిపే చర్చల్లో ఈ అంశం ప్రధానంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందించిన ఆయన … ఈ విషయంలో భారత్ ఇప్పటికే స్పష్టమైన వైఖరిని అవలంబిస్తోందని, ఈ సంక్షోభాన్ని ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించినట్టు గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News