బెర్లిన్: యూరప్ దేశాలనూ భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. పశ్చిమ జర్మనీ, బెల్జియం దేశాల్లో వరద బీభత్సానికి 110 మంది మృతి చెందగా, వందలమంది గల్లంతయ్యారు. గురు, శుక్రవారాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల పలు చోట్ల ఇండ్లు ధ్వంసం కావడంతో ప్రాణ నష్టం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. వరదల్లో సర్వం కోల్పోయినవారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌వాల్టర్ స్టీన్‌మీయర్ తెలిపారు. జర్మనీలోని ఒక్క రీన్‌ల్యాండ్‌పాలతినాతే రాష్ట్రంలోనే 60మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నదని అధికారులు తెలిపారు. గురువారం వరకే 1300మంది గల్లంతయ్యారని వారు తెలిపారు. రోడ్లు దెబ్బతినడం, ఫోన్ కనెక్షన్లు కట్ కావడంతో రెస్కూ ఆపరేషన్లు చేపట్టడం ఇబ్బందికరంగా మారిందని వారన్నారు. బెల్జియంలో మృతుల సంఖ్య 12కు చేరుకోగా, ఐదుగురు గల్లంతయ్యారు. భారీ వర్షాలకు భీకర గాలులు తోడు కావడంతో పలు చోట్ల వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.