Monday, December 23, 2024

యూరప్‌ను గమనించండి

- Advertisement -
- Advertisement -

యూరప్‌లో ఇటీవల చాలా ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటి ప్రభావం యూరప్ పైనేగాక అమెరికా సహా పాశ్చాత్య ప్రపంచం అంతటిపైన ఉండబోతున్నది. భారత దేశంతో పాటు తక్కిన ప్రపంచానికి కూడా దీని నుంచి మినహాయింపు లేదు. అందువల్ల ఈ యూరోపియన్ పరిణామాలను మనమంతా గమనించక తప్పదు. వివరాలలోకి వెళ్లే ముందు, ఈ నెల 6వ తేదిన జరిగిన యూరోపియన్ యూనియన్ సమావేశ నిర్ణయాలను చెప్పుకోవాలి. బ్రస్సెల్స్‌లో జరిగిన ఆ సమావేశంలో యూరోపియన్ యూనియన్ వారు తమ 32 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా, ‘యూరోపియన్ రక్షణ పారిశ్రామిక వ్యూహం’ పేరిట ఒక కీలకమైన పత్రాన్ని రూపొందించి చర్చలు జరిపారు. రెండవ ప్రపంచ యుద్ధ్దం 1945లో ముగిసి 1949లో పాశ్చాత్య దేశాలన్నింటికి కలిపి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) పేరిట ఉమ్మడి రక్షణ వ్యవస్థ ఏర్పడినప్పుటి నుంచి కొద్ది దేశాలను మినహాయించి యూరప్ అంతా ఆ నాటో నీడలోనే తన రక్షణను చూసుకుంటూ వస్తున్నది.

అన్నింటి కన్న సైనికంగా ఆర్థికంగా శక్తివంతమైన అమెరికా వాటికి నాయకత్వం వహిస్తున్నది. నాటోలో సభ్యత్వం లేకున్నా ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఆ సంస్థతో, అమెరికాతో సన్నిహిత సైనిక సంబంధాలున్నాయి. అమెరికా ఎక్కడ యుద్ధాలు, దాడులు జరిపినా వీరంతా తమ సైన్యాలను, ఆయుధాలను తోడు పంపుతుంటారు. ఆ విధంగా 74 సంవత్సరాలుగా నాటో ఉండి, అది ఇంకా కొనసాగుతుండగా, యూరోపియన్ యూనియన్‌కు ఇపుడు విడిగా ‘రక్షణ పారిశ్రామిక వ్యూహం’ ఎందుకు అవసరమైందన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం. ఈ వ్యూహాన్ని రూపొందిస్తున్నారంటే నాటో నుంచి బయటకు వెళ్లిపోతారని కాదు. ఆ సంస్థలో కొనసాగుతూనే తమ ప్రత్యేక రక్షణ కోసం, అందుకు అవసరమైన ఆయుధాలు, ఇతర రక్షణ సామగ్రి ఉత్పత్తి కోసం, దాని కోసం కావలసిన నిధులు సమీకరణ కోసం విడిగా యూరప్ పరిధిలో వ్యూహాన్ని తయారు చేసుకుంటారన్నమాట.

బయటకు అనకపోయినా ఇందులో అంతర్లీనంగా, సూచనా మాత్రంగా కనిపిస్తున్న విషయమేమింటే, ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా అటువంటి విధిలేని పరిస్థితి ఏర్పడినట్లయితే అమెరికా ఛత్రచ్ఛాయతో అవసరం లేకుండా తమ రక్షణను తాము చూసుకునేందుకు సిద్ధపడటమన్న మాట. వ్యూహపత్రం వివరాలన్నీ ఇంకా బయటకు రాలేదు గాని ఇప్పుటికి వెల్లడవుతున్న దానిని బట్టి ‘యూరోపియన్ దేశాలు తమ రక్షణ కోసం అవసరమైన పారిశ్రామిక సన్నద్ధతను పెంచుకునేందుకు పెట్టుబడులను హెచ్చించాలి. ఆ పని కలిసికట్టుగా చేయాలి. యూరప్ పరిధిలో చేయాలి. యూరోపియన్ యూనియన్‌లో రక్షణ సంబంధ పారిశ్రామిక సన్నద్ధతను సాధించేందుకు ఈ పత్రం ఒక స్పష్టమైన, దీర్ఘకాలికమైన దార్శనికతకు రూపాన్నిస్తుంది’ అంటూ ఆ పత్రం పేర్కొన్నది. ఇందులో ఒక్కొక్క మాట, ప్రతి ఒక్క పదం ఎంత అర్ధం కలదో, వాటి లోతు, విస్తృతి ఏమిటో నిర్వచిస్తూ పోవాలంటే చాలా పెద్ద వ్యాసం అవుతుంది.

అది అక్కర లేకుండా యథాతథంగా, స్థూలంగా ఆలోచించినా యూరప్ ఇపుడు ఏవిధంగా సరికొత్తగా ఆలోచిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి కొత్త ఆలోచనకు కారణం ఏమిటన్నది గ్రహించవలసిన ప్రశ్న. ఆ కారణాలనైతే యూరోపియన్ యూనియన్ తన పత్రంలో పేర్కొన్నట్లు లేదు. సమావేశ వివరాలను మీడియాకు తెలియజేసిన యూరోపియన్ కమిషనర్ (ఇంటర్నల్ మార్కెట్) థియెరీ బ్రిటన్ కూడా వివరించలేదు. అయితే ఆయన గమనార్హమైన మాట ఒకటి అన్నారు. యూరోప్ ఖండంలో తీవ్రస్థాయి యుద్ధం తిరిగి మొదలైనందున మనం రక్షణ సంబంధమైన సాంకేతిక పరిజ్ఞానం విషయంలోగాని, ఉత్పత్తుల విషయంలోగాని, మరిన్ని ఉత్పత్తులు, వేగవంతమైన ఉత్పత్తుల విషయంలో గాని మనం ఇక ఏ మాత్రం తాత్సారం చేయలేము అన్నారాయన. ఇవి కూడా చాలా అర్థవంతమైన మాటలైనట్లు కనిపిస్తున్నదే. ఇందుకు సంబంధించి మన చర్చను కొంత విస్తరించి అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్నున్నాయి. మొత్తం ఈ పరిణామాన్ని గ్రహించటానికి అవి కీలకం కూడా. యూరప్‌లో తీవ్రస్థాయి యుద్ధం తిరిగి మొదలుకావటమన్నది బ్రెటన్ అన్నది. ఉక్రెయిన్ష్య్రా యుద్ధం గురించి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో చిన్నచిన్న యుద్ధాలు కొన్ని జరిగినా ఇది అతి పెద్దది. ఒకవైపు మొత్తం నాటో రాజ్యాలు, మరొక వైపు రష్యా ఒంటరిగా మోహరించి ఉన్నాయి.

యుద్ధ్దం రెండేళ్లు పూర్తి చేసుకుని మూడవ ఏట ప్రవేశించింది. ఎవరిని ఎవరూ స్పష్టమైన రీతిలో ఓడించలేకపోతున్నారు. యుద్ధం ఎంత కాలమైనా సాగించగలమని రష్యా పదేపదే ప్రకటిస్తున్నది. ప్రస్తుతం వారిదే పైచేయిగా ఉంది. ఉక్రెయిన్‌కు నాటో మొత్తం కలిసి భారీ ఎత్తున ఆయుధాలను, నిధులను రెండేళ్లుగా సమకూర్చుతున్నా ఉపయోగం ఉండటం లేదు. ఈ క్రమంలో గమనించదగ్గవి మూడు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం యూరప్ కొత్త నిర్ణయానికి కారణం అవే కావచ్చు. యుద్ధం ఇంకా ఎన్నేళ్లు సాగేదీ తెలియని స్థితిలో ఈ భారాలన్నీ మోసేందుకు వీరిలో సుముఖత తగ్గుతున్నది. దానితో, రష్యాకు కొంత భూభాగాన్ని వదలివేసుకుని సంధీ చేసుకోవలసిందిగా ఉక్రెయిన్ పైవత్తిడి తెస్తున్నారు. ఇది చాలదన్నట్లు మరొక రెండు భయాలు మొదలయ్యాయి యూరప్ దేశాలకు. ఒకటి, రష్యన్లు ఉక్రెయిన్‌ను ఓడించిన తర్వాత ఇతర యూరోపియన్ దేశాలపై కూడా యుద్ధం సాగించగలరేమోనన్న అనుమానం.

రెండు, వచ్చే నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలిచిన పక్షంలో ఆయన కొంతకాలంగా హెచ్చరిస్తున్నట్లు నాటోను అనాథగా మార్చగలరేమోనని. ఇటువంటివి జరిగిన పక్షంలో పరిస్థితి ఏమిటి? అందరూ కలిసి ఉన్నపుడే రష్యాను ఆపలేకపోతున్నవారు అపుడేమి చేయగలరు? పైగా యూరప్ అర్థికస్థితి, పారిశ్రామికవాణిజ్య రంగాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తమ రాజకీయ ప్రాబల్యం తగ్గుతూ చైనా, రష్యాల బలిమి పెరుగుతున్నది. 1991లో సోవియెట్ పతనం, వార్సా కూటమి రద్దు తర్వాత అమెరికా నాయకత్వాన ఏక ధ్రువ ప్రపంచం కొంత కాలం సాగి, ఇపుడు అందరికీ బహుళ ధ్రువ ప్రపంచం పట్ల ఆకర్షణ పెరుగుతున్నది. ఈ సమస్యలను అమెరికా, యూరప్ సవ్యమైన రీతిలో పరిష్కరించుకునేందుకు బదులు నాటోను మరింత విస్తరిస్తూ రష్యా సరిహద్దుల వరకు తీసుకు వెళ్ళింది. నిజానికి ఉక్రెయిన్‌పై రష్యా దాడికి అదే మూలకారణమన్నది బహిరంగ రహస్యం.

ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో బ్రిటన్, ఫ్రాన్స్‌లు తమ వలస పాలనా సంస్కృతిని మరవలేక, ఉక్రెయిన్‌కు నేరుగా తమ సైన్యాన్ని పంపటం లేదా పంపే ఆలోచన చేయటం వంటివి చేస్తున్నారు. అదే జరిగితే తాము యూరప్‌పై అణు యుద్ధం సాగించవలసి రావచ్చునని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుత యూరోపియన్ యూనియన్ నిర్ణయానికి ఈ నేపథ్యమంతా ఉంది. రష్యన్ల వార్సా కూటమి 1991లోనే రద్దు కాగా, నాటో ఇంకా కొనసాగటమే గాక, అమెరికా కూటమి తన సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం యథేచ్ఛగా వ్యవహరించటమే ఈ సమస్యలన్నింటికీ మూలం. ఆ లక్షణాలు వదలుకుంటే యూరప్ భయపడవలసిందేమీ ఉండదు.

టంకశాల అశోక్
9848191767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News