రాజ్యాంగాన్ని మా ప్రభుత్వం గౌరవిస్తుంది
బిజెపిపై కాంగ్రెస్ అసత్య ప్రచారాలు
రాజస్థాన్‌లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
రాజస్థాన్: భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. రాజ్యాంగాన్ని తమ ప్రభుత్వం గౌరవిస్తోందని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేయ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు కూడా సాధ్యం కాదని ఆయన ప్రకటించారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో శుక్రవారం ఒక ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ తన ప్రభుత్వానికి రాజ్యాంగమే సర్వస్వమని వెల్లడించారు. బాబాసాహెబ్ అంబేద్కరే స్వయంగా వచ్చినా ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఆయనకు సాధ్యం కాదని మోడీ స్పష్టం చేశారు.
రానున్న లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ప్రభుత్వం మూడోసారి గెలిస్తే దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడతాయంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌పై ప్రధాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని, ఇప్పుడు మోడీని తిట్టడానికి రాజ్యాంగం పేరును కాంగ్రెస్ వాడుకుంటోందని ప్రధాని ఆరోపించారు.
అంబేద్కర్‌కు భారత రత్న పురస్కారం దక్కకుండా అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ బతికుండగా ఎన్నికలలో ఆయనను ఓడించిన కాంగ్రెస ఆయనకు భారత రత్న రాకుండా అడ్డుపడడంతోపాటు దేశంలో ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని అంతం చేయడానికి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు మోడీని దూషించడానికి రాజ్యాంగం పేరుతో అసత్యాలకు పాల్పడుతోందని ఆయన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.