Monday, December 23, 2024

200 యూనిట్ల లోపే ఉన్నా… కరెంటు బిల్లులు వస్తున్నాయ్ !

- Advertisement -
- Advertisement -

సోనియాగాంధీకి ‘బిల్లులు’ పోస్ట్ చేసిన ప్రజలు
200 యూనిట్ల లోపు బిల్లుల రద్దుకు వినతి

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎన్నికల సమయంలో సిఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తమ కరెంటు బిల్లులు సోనియాగాంధీనే కట్టాలని హైదరాబాద్ ఎల్ బి నగర్ పరిధిలోని నాగోల్ బస్తీ వాసులు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో చెప్పినట్టు 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు మాఫీ చేయకపోవడంతో కరెంటు బిల్లు స్లిప్, గతంలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటల వీడియోతో కూడిన పెన్ డ్రైవ్, కరెంటు బిల్లుల జాబితాలతో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీకి లేఖ రాసి పోస్ట్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత రెండు సార్లు కరెంటు బిల్లు వచ్చిందని , ఇప్పటికీ దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంపై వారు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదని ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పారని వారు గుర్తు చేశారు. 200 యూనిట్ల లోపే ఉన్నా తమకు కరెంటు బిల్లు వచ్చిందని.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. సోనియాగాంధీ వచ్చి తెలంగాణ ఆడబిడ్డల కరెంటు బిల్లులు కడతారని రేవంత్ రెడ్డి చెప్పారని.. అందుకే సోనియాగాంధీకే కరెంటు బిల్లులు పోస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. ఇచ్చిన మాట మరిచిపోయారేమోననే అనుమానం ఉందని, అలాగే కరెంటు బిల్లులు ఎలా ఉంటాయో సోనియాగాంధీకి కూడా తెలియాలనే లెటర్లు పోస్ట్ చేసినట్టు చెప్పారు.

కర్నాటక తరహాలో ఇక్కడా రద్దు చేయాలి: వై. సతీష్ రెడ్డి
కర్నాటకలో ఎలాంటి షరతులు లేకుండా 200 యూనిట్ల వరకు గృహవినియోగదారులందరికి కరెంటు బిల్లు రద్దు చేశారని, అదే విధంగా తెలంగాణలోనూ 200 యూనిట్ల వరకు రద్దు చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టొచ్చన్నారు. ఇప్పుడు ఒక బస్తీ నుంచే కేవలం పదుల సంఖ్యలో ఉత్తరాలు వస్తున్నాయని.. వచ్చే నెల కూడా కరెంటు బిల్లు విషయంలో నిర్ణయం తీసుకోక పోతే ఇక లక్షల సంఖ్యలోనే కరెంటు బిల్లులు ఢిల్లీకి పోస్ట్ చేస్తారని ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగోల్ బస్తీ మహిళలతో పాటు, స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు సతీష్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, బిఆర్‌ఎస్‌వి నాయకులు షఫీ తదితరులు పాల్గొన్నారు.

Electric bill posting

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News