మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతిష్టాత్మక జి20 సదస్సుతో ప్రపంచం దృష్టి భారత్ పై పడిందని, కానీ ప్రతిపక్షాలకు మాత్రం దేశ అభివృద్ధి కనిపించడం లేదని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం విమర్శించారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులు జి20లో పాల్గొనేందుకు తరలివచ్చారు.. ప్రపంచం దృష్టి భారత్ పై పడినా.. ప్రతిపక్షాలకు మాత్రం దేశ అభివృద్ధి కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. గ్లోబల్ లీడర్ గా అవతరించిన ప్రధాని మోడీని అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని కూడా అవహేళన చేస్తున్నారు. దుర్భాషలాడుతున్నారు. దేశంలో విభిన్న ఆచారాలు… నియమ నిబంధనలు ఉన్నాయన్నారు.
ప్రజాస్వామ్యంలో అన్ని మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలది. కానీ, నేడు ప్రతిపక్ష పార్టీల ప్రవర్తన భిన్నంగా ఉందన్నారు. భారత్ పేరుపై కూడా రాద్ధాంతం చేస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా పేరుతో విమర్శించి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని దుర్భాషలాడుతున్నారు.ఆ వ్యాఖ్యలను విపక్షాల కూటమి పార్టీలు సమర్థిస్తున్నాయి. ఇటీవల మల్లికార్జున ఖర్గే కుమారుడు ధర్మాన్ని కించపర్చినవారి మాటలను సమర్థించాడు. ఇలాంటి వారివల్లే దేశ అభివృద్ధి పతనానికి దారి తీస్తుందన్నారు. బిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలకు చెందిన నేతలు స్లీపర్ సెల్స్ లా పనిచేస్తున్నాకరని ఆరోపించారు. లిక్కర్ స్కాం అవినీతి ఢిల్లీ వరకు పాకింది. లిక్కర్ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. ఉదయనిధి తల్లి సనాతన ధర్మాన్ని విశ్వసిస్తుంది. ఆయనేమో ధర్మాన్ని అవహేళన చేస్తున్నాడు. చరిత్రను ఎవరూ మరిచిపోరు. సనాతన ధర్మంపై అనాలోచిత వ్యాఖ్యలు తగవు అన్నారు. సమావేశంలో రాష్ట్ర బిజెపి నేతలు సుభాష్, రాణీ రుద్రమ తదితరులు పాల్గొన్నారు.