భీంగల్: భీంగల్ మండల కేంద్రంలోని నందిగల్లీలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ నిర్మాణపనులు నత్తనడకన సాగుతున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని మున్సిపాలిటీలో నూతన గ్రంథాలయ భవనానికి నిధులు సమకూర్చారు. గత సంవత్సరం మంత్రి ప్రశాంత్‌రెడ్డి నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. పనులు ప్రారంభమైనప్పటికీ నిధులు పుష్కలంగా ఉన్న కాంట్రాక్టర్ నిర్లక్షం అధికారుల అలసత్వంతో పనులను మందకొడిగా కొనసాగుతున్నాయి. దీంతో నిర్మాణంలో ఉన్న స్థలంవద్ద స్థానికంగా పిల్లలు ఆడుకుంటూ వచ్చి గుంతలో పడి గాయాలపాలవుతున్నారు.
పశువులు సైతం గుంతల్లో పడుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎపుడు ఏప్రమాదంజరుగుతుందోనని స్థానికులు ఆందోళనచెందుతున్నారు. డ్రైనేజీ నిర్మించి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ దానిపై కల్వర్టు నిర్మించకపోవడంతో ఆ రోడ్డు గుండా ప్రయాణించేవారు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు అనేకమార్లు కాంట్రాక్టర్‌కు, అధికారులకు సైతం మొరబెట్టుకున్నా ఎవరూ స్పందించడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. తాజాగా యువకులు ఆరోడ్డుపై వచిచ డ్రైనేజీలో పడి తలకు గాయాలవడంతో ఆసుపత్రిపాలయ్యాడు. ఇకనైనా అధికారులు స్పందించి గ్రంథాలయ భవన నిర్మాణపనులను సత్వరం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.