Wednesday, January 22, 2025

ఎన్‌సిపి లోనే ఉన్నా.. రూమర్లు నమ్మొద్దు : అజిత్ పవార్

- Advertisement -
- Advertisement -

ముంబై : తన మద్దతుదార్లతో బీజేపీ లోకి చేరుతున్నట్టు వచ్చిన వార్తలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నేత అజిత్ పవార్ మంగళవారం తోసిపుచ్చారు. ఎలాంటి కారణం లేకుండా మీడియా రూమర్లు వ్యాపింప చేస్తోందని నిందించారు. “ ఈ రూమర్లలో ఏ ఒక్కదానిలో నిజం లేదు. ఎన్‌సిపి లోనే నేనున్నాను. ఉంటాను కూడా” అని ఆయన స్పష్టం చేశారు. ఎన్‌సిపిలోను, మహారాష్ట్ర విపక్షకూటమి లోను చీలిక వచ్చిందన్న చర్చలను ఆయన ఖండించారు. “ 40 మంది ఎమ్‌ఎల్‌ఎల సంతకాలు నేను తీసుకోలేదు. ఆ ఎమ్‌ఎల్‌ఎలు నన్ను ఈరోజు కలుసుకోడానికి వచ్చారు.

ఇదంతా రోజూ జరుగుతున్న ప్రక్రియే. వేరే అర్థం చేసుకోవద్దు” అని ఆయన చెప్పారు. “ ఈ అనవసర కోలాహలం కారణంగా ఎన్‌సిపి కార్యకర్తలు గందర గోళంలో పడ్డారు. శరద్ పవార్ నేతృత్వంలో ఎన్‌సిపి ఏర్పాటైంది. అధికారం లోను, ప్రతిపక్షం లోను మనం ఉన్న సందర్భాలు ఉన్నాయని, అందువల్ల ఆందోళన పడవద్దని వారికి చెప్పాలనుకుంటున్నాను” అని అజిత్ పవార్ పేర్కొన్నారు. “ఇలాంటి రూమర్లు బుధ్ధి పూర్వకంగా ప్రచారం చేస్తుంటారు. నిరుద్యోగం, రైతుల సమస్యలు వంటి కీలక అంశాల నుంచి దృష్టి మళ్లించడానికే ఇదంత చేస్తుంటారు” అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ కూడా చీలికపై ఊహాగానాలను కొట్టి పారేశారు. అజిత్ పవార్ ఎమ్‌ఎల్‌ఎలతో ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. ఆయన పార్టీ కోసమే పనిచేస్తున్నారని అర్థం చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News