Monday, December 23, 2024

వంద రోజులు కాకముందే అభాసుపాలు

- Advertisement -
- Advertisement -

నానాటికీ దిగజారుతున్న కాంగ్రెస్ పాలన

ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత

హామీల అమలుపై నాలుక మడతపెట్టి తిట్లకు దిగుతున్న కాంగ్రెస్ నేతలు

బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఫైర్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రోజు రోజుకూ దిగజారి పోతోందని, ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులన్నా కాకముందే ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంటున్నదని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. అధికారమే పరమావధిగా ఎన్నికలకు ముందు అలవిగాని హామీలిచ్చి, గ్యారంటీల పేరుతో ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల అనంతరం మాట మార్చిందని విమర్శించారు. సమయంతో సహా ప్రకటించి, ప్రమాణపూర్వకంగా ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చాలని ప్రజలు అడుగుతుంటే.. సమాధానమివ్వడం చేతకాక నాలిక మడతేసి అబద్దాలకు, బెదిరింపులకు దిగి తప్పించుకుంటున్నదని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మహాబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గాల ముఖ్యనేతలతో కెసిఆర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ప్రత్యర్థుల దుష్ప్రచారాలకు ప్రభావితమై తమకు మంచిచేసే బిఆర్‌ఎస్ పార్టీని, పని చేసే ప్రభుత్వాలను ప్రజలు దూరం చేసుకున్న సందర్భాలు చరిత్రలో ఉన్నాయని వివరించారు. తాము మోసపోయిన సంగతిని గ్రహించి ఆ తర్వాత కొద్దికాలంలోనే వాస్తవాలను తెలుసుకుని తిరిగి ఆదరించారని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీరు, సాగునీరు, కరెంటు వంటి కనీస అవసరాలను తీర్చలేకపోవడంతో తెలంగాణ ప్రజలు విస్మయం చెందుతున్నారని తెలిపారు. తమకు కొత్తగా ఇచ్చే తెలివి లేకున్నా గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను కూడా కొనసాగించలేక తన పాలనలోని డొల్ల తనాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ బయటేసుకుంటూ ప్రజల్లో అభాసుపాలవుతున్నదని అన్నారు.
రాజకీయాలలో గెలుపు, ఓటములు సహజం
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, ప్రజా క్షేత్రంలో ఉంటూ వారితో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని కెసిఆర్ పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేవారు. నాటి ఉద్యమకాలం నుంచీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బిఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తున్నదని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాదరణ పొందాలని పిలుపునిచ్చారు. తాను పాలమూరు ఎంపీగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. ఎంతో ఘనంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను పాలమూరులో అమలు చేశామని చెప్పారు. పాలమూరు నీటిగోసను తీర్చేందుకు ఉద్యమ సారధిగా తాను చేసిన పోరాటాలను, నాటినుంచి కరువుకోరల్లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లాను బిఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన విధానాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ వివరించారు. నీళ్లు లేక సాగులేక నాడు బండలా ఉన్న పాలమూరును సస్యశ్యామలం చేసి పచ్చని పంటలతో ధాన్య రాసులతో బంగారి కొండలా అభివృద్ధి చేశామన్నారు. నాటి కాంగ్రేస్ సహా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిలబడిపోయిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకున్నామని తెలిపారు.బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను అభివృద్ధి పనులను ఆటంకపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటున్నదని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఎత్తి పోతల పథకం ద్వారానే కొడంగల్‌కు పుష్కలంగా సాగునీటిని తరలించవచ్చని అలా కాకుండా ఉన్నదాన్ని తీసేసి కొడంగల్లుకు లిఫ్ట్‌ను మార్చడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. ఇటువంటి అనేక అనాలోచిత నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు.
కేవలం తమ స్వార్థంతో చేసిన మేలునుమరిచి పార్టీని వీడుతున్న వారిని పట్టించుకోనవసరం లేదని కెసిఆర్ స్పష్టం చేశారు. “ఎప్పడు సంపద కలిగినా అప్పుడు బంధువులు వత్తురు” అనే సుమతి శతకాన్ని అధినేత కెసిఆర్ ఈ సందర్భంగా ఉదహరించారు. కష్టకాలంలో ప్రజలతో నిలిచినవారే నిజమైన ప్రజా నాయకులని వ్యాఖ్యానించారు. పోయేవాళ్ల గురుంచి ఆలోచించకుండా అందరం కలిసికట్టుగా ప్రజా సమస్యలమీద పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కష్టకాలంలో వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటూ వెళ్లిపోతున్న అవకాశవాదులకు తిరిగి భవిష్యత్తులో సందివ్వకూడదు సార్ అంటూ ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న నేతలు చేసిన సూచనకు అధినేత సానుకూలంగా స్పందించారు. అటువంటి వారిని తిరిగి ఆదరించబోమని ఈ సందర్భంగా కెసిఆర్ స్పష్టం చేశారు.
దీర్ఘకాలిక లక్ష్యంతోనే బిఎస్‌పితో పొత్తు
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఎస్‌పితో పొత్తు ఉంటుందని కెసిఆర్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం నాడు తనను కలిసిన బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌తో జరిపిన చర్చలను, తీసుకున్న నిర్ణయాలను కెసిఆర్ సమావేశంలో వివరించారు. ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనారిటీ వంటి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే నాటి ఉద్యమ కాలం నుంచి ప్రగతి కాలం వరకు పనిచేస్తున్న బిఆర్‌ఎస్ పార్టీ, అదే సైద్ధాంతికతో భావ సారూప్యతతో పనిచేస్తున్న బిఎస్‌పితో పొత్తును ప్రజలు హర్షిస్తారని తెలిపారు. బిఆర్‌ఎస్‌తో బిఎస్‌పి పొత్తుపై ఇప్పటికే సానుకూల స్పందన వస్తున్నదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం మన శక్తులను కూడదీసుకోవాలని, కలిసి వచ్చే భావసారూప్య శక్తులను కలుపుకొని పోవాలని చెప్పారు. ఆ దిశగా మనం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రయోజనాలను కాపాడే దీర్ఘకాలిక లక్ష్యంతో కూడుకుని ఉన్నదని కెసిఆర్ అన్నారు. లౌకికవాద తాత్వికతతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కృషి, ఆ దిశగా పదేండ్ల పాటు అనుసరించిన కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో దళిత బహుజన శక్తులతో కలిసి పనిచేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మరింత చేరువవుతామన్నారు. రాబోయే కాలంలో బిఆర్‌ఎస్, బిఎస్‌పిలు కలిసకట్టుగా పనిచేసి ప్రజా అభీష్టాలను సంపూర్ణంగా నెరవేరుస్తామని కెసిఆర్ అన్నారు. ఈ దిశగా మరిన్ని చర్చలు జరిపి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుల విధి విధానాలను ఖరారు చేస్తామని అన్నారు. కాగా, బిఎస్‌పితో పొత్తును సమావేశం హర్షద్వానాల నడుమ ముక్తకంఠంతో ఏకీభవించింది. తన ప్రయత్నానికి మద్దతు ప్రకటించిన పార్టీ నేతలకు అధినేత కెసిఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
మహబూబ్‌నగర్ ఎంపి అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి
ఇప్పటికే నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్.. మంగళవారం మరో అభ్యర్థిని ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో జరిగిన సమావేశంలో పార్టీ నాయకలతో చర్చించి అందరి అభిప్రాయాలను అనుసరించి మహబూబ్‌నగర్ ఎంపి అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి పేరును కెసిఆర్ ప్రకటించారు. నాగర్‌కర్నూల్ ఎంపి అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదని కెసిఆర్ తెలిపారు. పార్టీ ముఖ్యులతో చర్చించి అభ్యర్థిని త్వరలోనే నాగర్‌కర్నూల్ అభ్యర్థిని ప్రకటిస్తానని అన్నారు. కాగా, 2019 ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్ రెడ్డి బిఆర్‌ఎస్ తరపున మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. బిఆర్‌ఎస్ పార్టీ తరపున కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోత్ కవిత పేర్లను కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

BRS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News