మరమ్మతుల అనంతరం క్లియర్ కానున్న
సూయజ్ కెనాల్ మార్గం
వేచి ఉన్న 367 సరుకు రవాణా నౌకలు
న్యూఢిల్లీ: ఈజిప్ట్ సూయజ్ కాలువలో చిక్కుకున్న భారీ కంటైనర్ నౌక ఎవర్‌గివెన్ ఇసుక మేట నుంచి పూర్తిగా బయటపడి నీళ్లపైకి వచ్చిందని స్థానిక అధికారులు తెలిపారు. నౌకను నీళ్లపైకి లాగేందుకు టగ్‌బోట్లను వినియోగించారు. సోమవారం సూయజ్ కాలువలో వచ్చిన భారీ అల కూడా నౌకను బయటకు లాగడంలో తోడ్పడిందని అధికారులు తెలిపారు. టగ్‌బోట్ల సాయంతో నౌకను నీటి మార్గంలోని గ్రేట్ బిట్టర్ లేక్ వరకు లాక్కెల్లారని అధికారులు తెలిపారు. అక్కడ దానికి
తనిఖీలు నిర్వహించి అవసరమైన మరమ్మతులు చేయనున్నారు.
ఎవర్‌గివెన్ సోమవారం ఉదయం పాక్షికంగా నీళ్లపై కదిలిందని మెరైన్ ట్రాఫిక్ డాట్ కామ్ తెలిపింది. అయితే,నౌకను పూర్తిగా నీటిలో కదిలేలా చేయడానికి మరికొన్ని రోజులు పడుతుందన్నారు. కానీ, సాయంత్రానికి ప్రకృతి కూడా అనుకూలించడంతో నీళ్లపైకి పూర్తిగా లాగగలిగారు. ఎవర్‌గివెన్ నౌక గత మంగళవారం నీళ్ల మార్గం నుంచి పక్కకు జారి కదలకుండా ఆగిపోయింది. దాంతో, ఆ మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలు స్తంభించిపోయాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన జల మార్గం ఇది. ఈ ఘటనతో రోజుకు 900 కోట్ల డాలర్ల విలువైన వాణిజ్య సరఫరాలు నిలిచిపోయాయి. క్రూడాయిల్‌తోపాటు పలు వాణిజ్య సరుకులు ఈ మార్గంలో సరఫరా అవుతాయి. ఎవర్‌గివెన్ నౌక వెనుక కనీసం 367 సరుకు రవాణా ఓడలు నిలిచిపోయాయి.
20 వేల కంటైనర్ల భారీ లోడ్‌తో ఉన్న ఎవర్‌గివెన్‌ను కదిలించేందుకు పది టగ్ బోట్లను ఉపయోగిస్తున్నారు. నౌక కొంతభాగం పక్కకు జారి ఇసుకమేటలో కూరుకుపోయిందని చెబుతున్నారు. కాగా, ఎవర్‌గివెన్ పూర్తిగా నీటిలో కదలడం ప్రారంభించినా ఆ దారిలో ఇప్పటికే క్యూలో వేచి ఉన్న నౌకలు క్లియర్ కావడానికి కనీసం 10 రోజులు పడుతుందని అంచనా. దాంతో, ఆ మార్గంలో వెళ్లాల్సిన డజన్లకొద్దీ నౌకలు ఇప్పటికే ప్రత్యామ్నాయంగా కేప్ ఆఫ్ గుడ్‌హోప్ మార్గంలో ప్రయాణిస్తున్నాయి.
LATEST: The Ever Given container ship that was stuck in the Suez Canal is now fully afloat.
The vessel was finally pulled free, allowing the crucial trade route to reopen to traffic https://t.co/0dC8LE0UFI pic.twitter.com/UZjcP2Mrpu
— Bloomberg Quicktake (@Quicktake) March 29, 2021