ఇసుకలో చిక్కుకున్న కంటైనర్ నౌక ‘ఎవర్ గివెన్’కు విముక్తి
రెస్క్యూ టీమ్ సహకరించిన ప్రకృతి
పున్నమి అలల పోటుతో మళ్లీ జలాల్లోకి భారీ నౌక
‘గ్రేట్ బిట్టర్ లేక్’ వద్ద లంగరు వేసిన నౌక
ప్రమాద ఘటనపై అధికారుల దర్యాప్తు
సూయజ్: అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక జలమార్గమైన ఈజిప్టులోని సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన భారీ కంటైనర్ నౌక ‘ఎవర్‌గివెన్’ ఎట్టకేలకు కదిలింది. ఇసుక తుపాను, బలమైన అలల కారణంగా గత మంగళవారం సూయజ్ కాలువలో నౌక అడ్డం తిరిగి దాని ముందుభాగంలో ఉన్న కొమ్ము బంకమట్టి, ఇసుకలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో నౌకలను తిరిగి నీటిలోకి తెచ్చేందుకు ఆరు రోజు రోజులుగా చేసిన ప్రయత్నాలు సోమవారం ఫలించాయి. నౌక చిక్కుకున్న చోట ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్ల ద్వారా తవ్వుతుండగా భారీ టగ్ బోట్లు నౌకను కదిలించాయి. వీటికి సముద్రపు పోటు కూడా తోడవడంతో అనుకున్న దానికన్నా ముందుగానే ఎవర్‌గివెన్‌ను సాధారణ స్థితికి తీసుకురాగలిగారు. అయితే నౌకను కదిలించే ప్రయత్నాల్లో పౌర్ణమి వల్ల ఏర్పడిన సముద్రపు పోటు అపారంగా తోడ్పడిందని సహాయక బృందాలు చెబుతున్నాయి. సాధారణంగా అమావాస్య, పౌర్ణమి ఘడియల్లో సముద్రపు అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.ఆదివారం పౌర్ణమి కావడంతో సూయజ్ కాలువలోను అలలు పోటెత్తాయి. ఈ పోటు ఎవర్‌గివెన్ ఇసుకలోంచి బైటికి వచ్చేందుకు తోడ్పడింది.‘ ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఏర్పడిన సముద్రపు పోటు మాకు అద్భుతమైన సాయం చేసింది.
సముద్రపు పోటు నౌకను బలంగా నెట్టింది. ఈ పోటు సమయంలో సముద్రపు అలల శక్తి రెండు టగ్ బోట్లు లాగిన దానికన్నా ఎక్కువగా ఉంది’ అని సహాయక బృందాలు తెలిపాయి. అయితే నౌక నీటిపై తేలిన తర్వాత దాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావడం కూడా చాలా కష్టమైందని రెస్కూటీం సంస్థ బోస్కాలిస్ వెస్ట్‌మినిస్టర్ సిఇఓ పీటర్ బెర్డోస్కీ చెప్పారు. నౌకను తిరిగి జలాల్లోకి తెచ్చామని ప్రకటించిన ఆయన ‘మా నిపుణుల బృందం, సూయజ్ కెనాల్ అథారిటీతో కలిసి ఎవర్ గివెన్‌ను తిరిగి నీళ్లపై తేలియాడేలా చేశారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దీంతో సూయజ్ కెనాల్‌లో తిరిగి నౌకల రాకపోకలు మొదలు కానున్నాయి’ అని చెప్పారు.
మంగళవారంనుంచి సూయజ్ కెనాల్‌లో తిరిగి నౌకల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ నౌకను కాల్వ మధ్యలో ఉన్న గ్రేట్ బిట్టర్ లేక్ వద్ద లంగరు వేసి ఉంచారు. అక్కడ నిపుణులు నౌకకు ఏమయినా నష్ట వాటిల్లిందా అని పరీక్షిస్తారు. అలాగే నౌక ఇసుకలో కూరుకు పోవడానికి కారణాలేమిటనే దానిపైన కూడా దర్యాప్తు జరుపుతారు. అయితే ఈ నౌక తిరిగి తన ప్రయాణాన్ని ఎప్పుడు ప్రారంభిస్తుందో ఇప్పుడే చెప్పలేమని నౌక యజమాని షోయీ కిసెన్ చెప్పారు. ఒకవేళ నౌక ఏమయినా దెబ్బతిని ఉంటే ఈజిప్టులో కానీ, మరో ప్రాంతంలో కానీ మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే చిన్న పాటి నష్టాలు తప్ప నౌక సురక్షితంగానే ఉన్నట్లు భావిస్తున్నారు.
మరో పది రోజులు పట్ట వచ్చు
ఇదిలా ఉండగా సూయజ్ కెనాల్‌లో తిరిగి నౌకల రవాణా ప్రారంభమైనప్పటికీ కాలువ ఇరు వైపులా ఆగిపోయిన వందలాది నౌకలన్నీ క్లియర్ కావడానికి మరో పది రోజులు పట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. చమురు నుంచి ఆహార ధాన్యాల దాకా వివిధ రకాల సరకుల లోడ్‌తో ఉన్న దాదాపు 327 నౌకలు సూయెజ్ కాలువలో ఇరు వైపులా ఆగిపోయి ఉన్నాయి. కాగా ఎవర్ గివెన్ నౌక తిరిగి కాలువలో తన ప్రయాణం మొదలు పెట్టడంతో అది ఆగి ఉన్న చోటికి దగ్గర్లోనే ఉన్న అమెర్ గ్రామంలో పండగ వాతావరణం నెలకొనింది.
గత ఆరు రోజులగా ఈ నౌక ప్రమాద దృశ్యాలను చిత్రీకరించడానికి ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన వందలాది మంది ఫొటోగ్రాఫర్లు, మీడియా ప్రతినిధులందరూ ఇదే గ్రామంలో బస చేసి ఉండడంతో ఒక్కసారిగా ఈ కుగ్రామం అందరి దృష్టిని ఆకర్షించింది. అనుకున్న దానికన్నా ముందుగానే అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసినందుకు రెస్కూ టీం సిబ్బందిని అందరూ అభినందిస్తున్నారు.ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్‌సిసి కూడా రెస్కూ ఆపరేషన్ విజయవంతమైనందుకు ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. కైరోలోని అమెరికా ఎంబసీ కూడా ఈజిప్టుకు అభినందనలు తెలియజేసింది.