Sunday, December 22, 2024

ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించాలి : వికాస్‌రాజ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఆదేశించారు. బహదూర్‌పురా, గోషామహల్, నాంపల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో వచ్చిన ఫిర్యాదులపై ఆదివారం ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులు అందిన ప్రతి అంశాన్ని సవివరంగా పరిశీలించి, తగు చర్యలు చేపట్టి సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారులను వికాస్‌రాజ్ ఆదేశించారు. అదే విధంగా జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, 2వ ఓటరు జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమం- 2023 లో భాగంగా ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కోరారు. కార్యక్రమ పురోగతిని ఆయన సమీక్షించారు. అన్ని జిల్లాలు 18- ఏళ్ల వయస్సు గల వారి ఓటు నమోదు, జాబితాలో దివ్యాంగుల ,ట్రాన్స్ జెండర్ ఓటర్లను గుర్తించడం, వారిని ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మెరుగు పరిచేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లోకేష్‌కుమార్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సర్ఫరాజ్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
బూత్ స్థాయిలో అందుబాటులో ఫారం 6, 7, 8 దరఖాస్తులు..
అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఓటరు శిబిరాల పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారుల వద్ద ఫారం 6, 7, 8 దరఖాస్తులను అందుబాటులో ఉంచారు. 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటరు జాబితాలో పేరు, చిరునామా మార్పులు, సవరణలు, తొలగింపుల కోసం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, కళాశాలలో 18 సంవత్సరాలు వయసు నిండిన విద్యార్థులు ఓటరు జాబితాలో తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లను గుర్తించి ప్రత్యేక మార్కింగ్ ద్వారా ఓటరు నమోదుకు చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News