రోజుకో కొత్త రకం సైబర్ నేరం
పోలీసులు దృష్టి సారించేలోపే ప్యాకప్
సైబరాబాద్‌లో 1,119, రాచకొండలో 704 నేరాలు
మనతెలంగాణ, హైదరాబాద్ : సైబర్ నేరస్థులు రోజుకో రకమైన నేరం చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గతంలో ఎక్కువగా సంప్రదాయ నేరాలైన ఓటిపి, బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకుని మోసం చేసేవారు. బాధితుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బులను దోచుకునేవారు. వాటిపై బ్యాంకర్లు, పోలీసులు ప్రజలకు విస్కృతంగా అవగాహన కల్పించడంతో ఎవరూ తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, ఓటిపి, ఆధార్ కార్డు, ఎటిఎం పిన్ నంబర్, సివివి నంబర్ చెప్పడంలేదు. దీంతో సైబర్ నేరస్థులు నూకలు చెల్లడంలేదు, దానిని చాలా తక్కువగా చేస్తున్నారు. జార్జండ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన యువకులు సైబర్ క్రైంను కుటీర పరిశ్రమగా నడిపిస్తున్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2018లో 293, 2019లో 477, 20201,119 నేరాలు జరిగాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో 2019లో 334 కేసులు, 2020లో 704 సైబర్ నేరాలు జరిగాయి. సోషల్ మీడియా నేరాలు 84, ఆన్‌లైన్ మార్కెట్ 81, ఫిషింగ్ 51, లోన్ మోసాలు 42, నైజీరియన్లు 40, జాబ్ మోసాలు 39, ఎటిఎం 15 నేరాలు చేశారు. రాచకొండ పోలీసులు ఈ ఏడాది సైబర్ క్రైంలో 59శాతం కేసులను డిటెక్ట్ చేసి నిందితులను అరెస్టు చేశారు. షేర్ బికే పేరుతో సైబర్ నేరాలు చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో బైక్స్ అద్దెకు ఇవ్వడం పేరుతో దోచుకున్నారు. పోలీసులు విచారణ చేస్తున్నారని తెలియడంతో జనవరి 25వ తేదీన మూసివేశారు. దీంతో లక్షలాది మంది బాధితులు లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు.
కొత్త వారు పాతపద్ధతి…
కొత్తగా సైబర్ నేరాలు చేసేందుకు వచ్చిన వారు మాత్రమే ఇంకా ఓటిపి, ఎటిఎం కార్డు బ్లాక్ తదితర వివరాలు అడుగుతున్నారు. చాలా మంది పాత నేరస్థులు దీనిని వదిలేసి క్యూఆర్ కోడ్‌తో కొట్టేస్తున్నారు. గూగుల్‌లో ఎవరు ఏమి వెతికారో వారి మొబైల్ నంబర్ తెలుసుకుని చోరీలు చేస్తున్నారు. బాధితుల నంబర్లకు ఫోన్ చేసి క్యూఆర్ కోడ్ పంపిస్తున్నారు. కేవలం రూ.1 మాత్రమే పంపించాలని చెప్పడంతో బాధితులు సులభంగా నమ్మి బార్ కోడ్‌ను స్కాన్ చేసి సైబర్ నేరస్థులు చెప్పినట్లు చేస్తున్నారు. దానిని స్కాన్ చేసిన తర్వాత వివరాలు అడగడంతో వాటిని ఎంటర్ చేయడంతోనే బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం దోచుకుంటున్నారు. ఒక వేళా బాధితులు తమ ఖాతాలోని డబ్బులు పోయాయని ఫోన్ చేస్తే తప్పు జరిగిందని, ఇసారి అలా జరగదని చెప్పి మళ్లీ క్యూఆర్ పంపిస్తున్నారు. దీనిని కూడా బాధితులు స్కాన్ చేయడంతో వారి బ్యాంక్ ఖాతాలోని మొత్తం డబ్బులను దోచుకుంటున్నారు. ఇలా చేయడంతో సైబరాబాద్‌లో ఇద్దరు బాధితులు రూ.99,500, రూ.57,000 పోగొట్టుకున్నారు. ఈ మధ్య ఇలాంటి నేరాలు చాలా జరుగుతుండడంతో బాధితులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
డబ్బుల రికవరీ మర్చిపోవాల్సిందే…
సైబర్ నేరస్థులు కొట్టేసిన సోమ్ము రికరీ మాట దాదాపు మర్చిపోవాల్సిందే. సైబర్ నేరస్థులు కొట్టేసిన డబ్బులతో వెంటనే వస్తువులు కొనుగోలు చేయడంతో పోలీసులకు రికవరీ కష్టంగా మారింది. బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బులను మాత్రమే ఫ్రీజ్ చేస్తున్నారు. చాలామంది సైబర్ నేరస్థులు డబ్బులను కొట్టేయగానే ఇంటికి కావాల్సిన వస్తువులు, సిమెంట్, ఐరన్ రాడ్ తదితర వాటిని కొనుగోలు చేస్తున్నారు. చాలామంది నేరస్థులు కొత్తగా ఇళ్లను నిర్మించుకుంటున్నారు. దీంతో వాటికి కావాల్సిన వస్తు సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా వేరే వారి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేయించడంతో వారికి కమీషన్ ఇస్తున్నారు. ఇన్ని విధాలుగా డబ్బులు ఎక్కడికక్కడ పంచుకోవడంతో రికరీ లేకుండా పోతోంది. ఇలా జరగడంతో బ్యాంక్ ఖాతాలను డబ్బులు తీసుకుని ఇస్తున్నవారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు.