Friday, December 27, 2024

ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా ప్రణాళిక చేయాలి

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. సుధాకర్ లాల్ సూచించారు. శుక్రవారం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు, పర్యవేక్షణ సిబ్బందికి, ఎంఎల్‌హెచ్‌పిఎస్‌కు, ఏరియా ఆసుపత్రి సిబ్బందికి సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా ఆసుపత్రుల కో ఆర్డినేటర్ డాక్టర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ ప్రతి రోజు 24 గంటలు స్త్రీ వైద్య నిపుణులు, స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉంటారని, హై రిస్కు గర్భవతులను తప్పనిసరిగా ప్రాంతీయ ఆసుపత్రి అచ్చంపేటకు పంపించాలని, హై రిస్క్ గర్భవతులను కాన్పు తేదికి పది రోజులు ముందుగానే ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని, కాన్పుల సంఖ్య పెంచే విధంగా అందరు సహకరించాలని కోరారు. ప్రతి శుక్రవారం కుటుంబ నియంత్రణ చికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు.

జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతి మంగళ, గురువారాలలో నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో గర్భవతులకు 18 నుంచి 22 వారాల మధ్య టీఫ స్కాన్ సౌకర్యం ఉంటుందని, కావున గర్భవతులను 102 వాహనం ద్వారా తరలించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా తెలిపారు. ప్రతి మంగళవారం మన్ననూర్, బల్మూర్, ఉప్పునుంతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య మహిళ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మహిళలకు రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశ ముఖద్వారం క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని, మహిళలకు ఋతుస్రావం సమస్యలు,

సంతానలేమి సమస్యలు, తదితర పోషకాహార సమస్యలతో బాధపడుతుంటే వారిని ప్రతి మంగళవారం ఈ మూడు ప్రాథమిక కేంద్రాలకు పంపించాలని తెలిపారు. జీవనశైలి వ్యాధులైన అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాం బినేషన్ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయని, ఎవరు కూడా ప్రైవేట్‌లో వెళ్లకుండా ఈ కాంబినేషన్ మందులు వాడుకునే విధంగా అవగాహన కల్పించి ప్రొత్సహించాలన్నారు.

ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలని, ఒకవేళ ప్రైవేట్ ఆసుపత్రిలో కాన్పు జరిగితే ఆ సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తారాసింగ్, డాక్టర్ కృష్ణ, డాక్టర్ స్రవంతి, డాక్టర్ హరిత, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారులు, స్టాఫ్ నర్సులు, ఉప మలేరియా అధికారి అశోక్ ప్రసాద్, పర్యవేక్షణ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News