స్టార్ క్యాంపెయినర్లు లేకుండా కాంగ్రెస్ ప్రచార సభలు
అంటీముట్టనట్టుగా వ్యవహారిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు
ఈ నెల 20వ తేదీ నుంచి రంగంలోకి ఏఐసిసి అగ్ర నాయకులు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెయిన్‌లు కనబడడం లేదు. ఎవరి నియోజకవర్గంలో వారే స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహారిస్తున్నారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్ ఉండగా ఆ లోపు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలు, సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు పాల్గొనడం లేదు. ప్రచారానికి నూతన క్యాపెంయినర్ల జాబితాను ఇప్పటి వరకు ఆ పార్టీ విడుదల చేయలేదు. గతంలో స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేసిన కోమటిరెడ్డి ఎన్నికల ప్రచారంలో తిరగడం లేదు. ఆయనతో పాటు రాష్ట్రంలోని పలువురు కీలక నేతలు నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికకు 38 మంది స్టార్ క్యాంపెయిన్‌లు
గత సంవత్సరం జరిగిన మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి 38 మంది నేతలను కాంగ్రెస్ అధిష్టానం స్టార్ క్యాంపెయిన్‌లుగా నియమించింది. అప్పట్లో ఆ జాబితాను పార్టీ జనరల్ సెక్రటరీ కెసి. వేణుగోపాల్ విడుదల చేశారు. ఆ ఉప ఎన్నిక సమయంలో మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తదితరులతో పాటు మరికొందరు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ప్రచారంలో పాల్గొనకుండా విదేశీ పర్యటనకు వెళ్లారు.
చాలామందికి సిఎం సీటు పైనే….
ప్రస్తుతం చాలామంది నేతలు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహారిస్తున్నారు. ఒకరి నియోజకవర్గంలో తాము వెళ్లి ప్రచారం చేస్తే తమకు వచ్చేది లేదని పలువురు నాయకుల ఆలోచనగా తెలుస్తోంది. నియోజకవర్గంలో గెలిపిస్తే రాష్ట్రానికి సారథులుగా మారుతామని ఇప్పటికే భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గా రెడ్డిలు బహిరంగంగా చెప్పగా తామేమీ తక్కువ కాదని ఎంపి ఉత్తమ్, మాజీ మంత్రి జానా రెడ్డిలు సైతం అదే బాటలో పయనిస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని క్షేత్రస్థాయి కేడర్ కృషి చేస్తుంటే, అగ్ర నేతలంతా స్వప్రయోజనాల కోసమే ప్రయత్నించడం విచిత్రంగా ఉందని కేడర్ అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం.
ఈ నెల 20వ తేదీ నుంచి ఢిల్లీ నుంచి
అయితే అన్ని నియోజకవర్గాల్లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆయన పోటీ చేస్తున్న రెండు సెగ్మెంట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కీలక నియోజకవర్గాలన్నింటిలోనూ ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థిస్తున్నారు. పార్టీ గెలుపు కోసం పాటు పడకుండా సిఎం కుర్చీపైనే అగ్రనేతలు ఆశలు పెంచుకోవడంపై కేడర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అగ్రనేతలంతా కలిసి కట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని నేతలు కోరుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఎవరూ పాల్గొనడం లేదని ఏఐసిసి దృష్టికి వెళ్లడంతో దీపావళి తరువాత (ఈనెల 20వ తేదీ నుంచి) ఢిల్లీ నుంచి ఏఐసిసి నేతలు తరలివచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.