మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ లో 4 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి హరీష్ రావుతో కలిసి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో తండాలు అన్ని రకాల సమస్యలను ఎదుర్కొన్నాయని, ముఖ్యంగా తాగునీరు, విద్య, వైద్యం కోసం ఇబ్బందులు పడ్డారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో ప్రగతిని సాధించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతున్నదని ఆయన వెల్లడించారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా తో పాటు, అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని, రైతులతో పాటు, అన్ని వర్గాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా ఎస్ పి ఆర్.వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, డిఎంఇ రమేష్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సహకార సంస్థ అధ్యక్షుడు సాయిచంద్, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు బాద్మి శివ కుమార్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యాదయ్య, డిఎంహెచ్ఒ డాక్టర్ కృష్ణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.