Monday, January 20, 2025

ప్రతి ఒక్కరూ సిఎం పదవికి సమర్థులే…

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి ఎంపికకు ఓ పద్ధతి, విధానం ఉంటుంది
తాను పార్టీకి  కెప్టెన్‌ మాత్రమే
ఎమ్మెల్యేలందరూ కలిసి సిఎల్పీ నేతను ఎన్నుకుంటారు !

మనతెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 85 ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ప్రతి ఒక్కరూ సిఎం పదవికి సమర్థులేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎంపికకు ఓ పద్ధతి, విధానం ఉంటుందన్నారు. క్రికెట్ టీమ్ సెలక్షన్ కమిటీ ప్రకటిస్తుందని, వీరిలో ఒకరు కెప్టెన్ అవుతారని రేవంత్ అన్నారు. అలాగే ఎమ్మెల్యేలంతా కలిసి చర్చించి సిఎంను ఎన్నుకుంటారన్నారు. క్రికెట్‌లో కెప్టెన్ ఎంపిక సమయంలో బిసిసిఐ కీలక పాత్ర పోషించినట్లు ఇక్కడ కూడా అధిష్టానం ఉంటుందని ఆయన గుర్తు చేశారు. తాను పార్టీకి మాత్రం కెప్టెన్ అని ఎమ్మెల్యేలందరూ కలిసి సీఎల్పీ నేతను ఎన్నుకుంటారని ఆయన గుర్తు చేశారు. అప్పుడే సిఎం పదవిపై చర్చ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల తర్వాత సిఎం ఎవరన్నది అందరికీ తెలుస్తుందని, డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆయన గుర్తు చేశారు.

నాగార్జున సాగర్ ఎక్కడికీ పోదు, గేట్లు ఎక్కడికీ పోవు…
నాగార్జున సాగర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులపై రేవంత్ స్పందించారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్నవారన్నారు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రభుత్వం రావాలన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సమస్యలపై సామరస్యపూ ర్వకంగా పరిష్కరించుకుంటామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా వ్యవహారిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభమయ్యే ముందు ఇలాంటి అంశాలకు తెరలేపారని, తెలంగాణ ప్రజలు సమస్యను అర్థం చేసుకోగలిగేవాళ్లు. ఎవరు? ఎందుకు? ఏం ఆశించి ఇలా చేస్తున్నారన్నది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. వ్యూహాత్మకంగానే అలా చేశారని దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదిన్నరేళ్లు అయ్యిందని, నాగార్జున సాగర్ ఎక్కడికీ పోదు, గేట్లు ఎక్కడికీ పోవు, నీళ్లూ అక్కడే ఉంటాయన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సీఈఓ బాధ్యత తీసుకుని ఆ అంశంపై చర్చించాలని ఉద్రిక్త పరిస్థితులు కొనసాగకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నీళ్లకు సంబంధించి ఏ రాష్ట్ర సమస్యనైనా పరిష్కరిస్తామన్నారు. దీనికి సంబంధించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను రేవంత్‌రెడ్డి ఊటంకించారు. ఈ నీటి సమస్యను సామరస్య పూర్వకంగా ఇద్దరికీ ఉపయోగకరంగా ఉండేలా పరిష్కరించుకుంటామన్నారు. పాకిస్తాన్, భారత్‌ల వలే నీటిని పంచుకుంటున్నాయని రెండు దేశాలే నీటి విషయంలో సామరస్యంగా పోతుంటే రాష్ట్రాలు నీటిని పంచుకునే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News