Wednesday, January 22, 2025

ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

భూపాలపల్లి కలెక్టరేట్: రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మంగళవారం అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం పురస్కరించుకొని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ కొంత సమయం తీసుకొని తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య పరిపాలనలో మన ఓటు ద్వారానే ప్రభుత్వాలను నిర్ధేశించవచ్చునని కలెక్టర్ అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు దివ్యాంగులు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవసరమైన వాహనాలు, ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

భారతదేశంలో మనం వేసే ఓటు ద్వారానే మన నాయకులు నిర్ణయం అవుతారని, గుజరాత్ రాష్ట్రంలో గిరి అడవి ప్రాంతంలో ఒక ఓటరు కోసం కూడా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. పోలింగ రోజున ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఆ రోజు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ఉంటుందని, మన భవిష్యత్తు , సంక్షేమం, అభివృద్ధి దిశగా కొనసాగేందుకు ఓటు హక్కు వినియోగించుకోవడం కీలకమని కలెక్టర్ అన్నారు.

1947 సంవత్సరంలో భారతదేశం, పాకిస్థాన్‌కు స్వాతంత్య్రం ఒకేసారి వచ్చిందని, ప్రజాస్వామ్యబద్దంగా ఉన్నందున భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని, ప్రజలు, నాయకులను నిర్మించడం వలనే ఇది సాధ్యమైందని కలెక్టర్ అన్నారు. 10 సంవత్సరాల క్రితం దేశంలో 30 శాతం గ్రామాలలో విద్యుత్ ఉండేది కాదని, అన్ని వర్గాల వారికి విద్యుత్ కోతలు ఉండేవని, ప్రస్తుతం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతుందని, త్రాగునీరు, విద్యుత్ సరఫరా సమస్యలు పరిష్కారం అయ్యాయని కలెక్టర్ తెలిపారు.

1991లో భూపాలపల్లిలో కేవలం 4000 జనాభా మాత్రమే ఉండేదని, నేడు లక్షకు పైగా జనాభా చేరుకుందని తెలిపారు. గతంలో ఉన్న విష జ్వరాల చావులు నేడు లేవని, వైద్య వ్యవస్థను బలోపేతం చేసుకున్నామని, విద్యావ్యవస్థలు మార్పులు తీసుకొని వస్తున్నామని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని గెలిపించిన ప్రభుత్వం ద్వారా ఇదంతా సాధ్యమైందని కలెక్టర్ అన్నారు.

రాబోయే ఎన్నికలలో సైతం ప్రజలు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకొని ప్రభుత్వాలను ఎన్నుకోవాలని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని, పోలింగ్ రోజున మన చుట్టు ఉన్న ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకోకపోతే వారు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం సీనియర్ ఓటర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి జడ్పి సిఈఓ విజయలక్ష్మి, తహసీల్దారు శ్రీనివాస్, సంబంధిత అధికారులు, వృద్దులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News