Monday, January 20, 2025

18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మున్సిపల్ కమీషనర్లు, బూత్ స్థాయి సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన, తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయాలని, చట్టపరిధిలో ఎన్నికల కమీషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని, ఎన్నికల నియమావళి ననుసరించి విధులు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారందరి పేర్లను ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు చేయాలని, బూతు స్థాయి అధికారులు వారి పరిధిలోని ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించాలని అన్నారు.

ఓటరుగా నమోదు, మార్పులు-చేర్పులు, తొలగింపులకు సంబంధించిన సమాచారంతో పాటు అందుకు అవసరమైన సమాచారం సేకరించి నిర్ణీత ఫారాల ద్వారా పనులు పూర్తీ చేయాలని, ఎన్నికల కమీషన్ జారీ చేస్తున్న ప్రతీ అంశాన్ని ఎన్నికల సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ట్రాన్స్ జెండర్లు , సెక్స్ వర్కర్ల సమాచారాన్ని సేకరించి వారికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఆయా బూతు స్థాయి అధికారులకు ఉందని అన్నారు.

దివ్యాంగుల ఓటర్ల పేరును నమోదు చేసి ఫ్లాగ్ చేయాలని అన్నారు. జెండర్, E.P. రేషియో లను పరిశీలించాలని సూచించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని బూతు స్థాయి అధికారులకు ఆయా సహాయ ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఓటరు జాబితా నుండి పేరును తొలగించే సమయంలో తొలగింపుకు కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని అన్నారు.

జిల్లాలో 18, 19 ఏళ్ళ వయస్సు కలిగిన యువత పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేయడంలో కొంత వ్యత్యాసం ఉన్నట్లు గమనించడం జరిగిందని, అలాగే 80 సంవత్సరాలకు పైబడి ఉన్న వారి పేర్ల తొలగింపునకు సమాచారాన్ని సేకరించాలని అన్నారు. ఒక ఫారంలో నమోదు చేయాల్సిన వివరాలు మరో ఫారంలో నమోదు చేయడం వలన తొలగింపునకు కారణం అవుతున్నాయని, నిర్దిష్ట ఫారాలలో పూర్తీ సమాచారాన్ని నమోదు చేయాలని అన్నారు.

గత జనవరి 5 న ఫైనల్ ఎలక్టోరల్ సిద్దం చేయడం జరిగిందని, త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు రెండవ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుతున్నదని, అక్టోబర్ 1, 2023 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరి పేరు ఓటరుగా నమోదు చేయవలసి ఉందని అన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, మాస్టర్ ట్రైనర్లు సంతోష్, నవీన్, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News