హైదరాబాద్: ప్రణాళికాబద్దమైన పురోగతికి పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేస్తూ శ్రేష్ఠమైన పట్టణ జీవనానికి ధృడమైన పునాది వేయడంతో పాటు పౌరులకు నాణ్యమైన సేవలను అందించడమే లక్షంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టుందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మన నగరమైన హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ది చేసుకునేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలతో పాటు రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 3 నుంచి15 తేదీ వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం వివరాలను బుధవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో హరితహారం, శానిటేషన్, ఘన వ్యర్థాల నిర్వహణ,రోడ్లు, నాలాల అభివృద్ది, పనులన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
పురపాలక శాఖమంత్రి కె. కెటిఆర్ దిశా నిర్ధేశనంలో ఇప్పటికే నగరంలో దీర్ఘ కాలికంగా నెల కొన్న సమస్యను పరిష్కారించుకుంటు ముందుకు వెళ్లుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వాల హాయంలో రూ.5లక్షల పనులు సైతం పూర్తి కావడానికి 5 ఏళ్ల కాలం పట్టేందని, అదే ఇప్పటీ వేలాది కోట్ల రూపాయాలతో చేపడుతున్న అభివృద్ది పనును త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి వ్యయం ఎంత అన్నది ముఖ్యం కాదని సమస్య పరిష్కారించడమే ముఖ్యమని పేర్కొన్నారు. తమ పిల్లలకు ఎంత ఆస్తిని ఇచ్చామన్నది గొప్ప కాదని, వారి ఆరోగ్యవంతంగా జీవించడానికి ఓచక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వడం ముఖ్యమని సిఎం కెసిఆర్ పదే పదే చెప్పడమే కాకండా హరితహారం కార్యక్రమం ద్వారా నగరంలో ఆలాంటి స్వచ్చమైన వాతావరణాన్ని తీసుకువచ్చారని మంత్రి చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణకు సంబంధించి నగరంలోని నెలకొన్న ఇప్పటీకే డివిజన్ స్థాయిలో సమిక్షా సమావేశాలు నిర్వహించి అంతా సిద్దం చేశామని తెలిపారు.
గ్రేటర్‌లో 391 ప్రత్యేక బృందాలు
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 391 ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతి టీం కు రెండు వాహనాలను కేటాయించడం జరిగిందన్నారు. ఈ టీం లు ప్రజలతో కలిసి ఆయా కాలనీలు, బస్తీలలో పర్యటించి పారిశుధ్య నివారణ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణ, హాస్పిటల్స్, స్కూల్స్, బస్తీ దవాఖానా లు, అంగన్ వాడి కేంద్రాలు, బస్తీలు, కాలనీలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, వర్షాకాలం సమీపిస్తున్నందున పట్టణ ప్రగతి ద్వారా వర్షాలు, వరద ముంపు సమస్యలు ఏర్పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. వర్షపునీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలను చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహాన కల్పించేలా విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అంతకు ముందు జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, కౌసర్ మొహినోద్దిన్, మౌజం ఖాన్, టిఎస్‌ఈడబ్లూఐసి చైర్మన్ శ్రీధర్ రెడ్డి, బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ నగేష్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్,అదనపు కమిషనర్ సంతోష్, జోనల్ కమిషనర్ లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.