Saturday, November 16, 2024

ఆరోగ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -

నంగునూరు: ప్రతిరోజు ఆడుతూ, పాడుతూ వాకింగ్, రన్నింగ్, యోగా చేస్తూ ఆరోగ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సిపి శ్వేత, అదనపు డిసిపి మహేందర్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజగోపాల్‌పేట పోలీస్ వారి ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీస్, ఫ్రెండ్లీ 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు. 5కే రన్ కార్యక్రమాన్ని అదనపు డిసిపి మహేందర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న సిపి శ్వేత మాట్లాడారు. మనిషి మనుగడకు నడక ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. పక్షులు, జంతువులు ఎప్పుడూ ఒకే దగ్గర నిలకడగా ఉండవని ఎగురుతూ ఆడుతూ, పాడుతూ ఉంటాయని, అందుకే అవీ ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు.

మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని తెలిపారు. డబ్బులు ఉంటే దాచి పెట్టుకోవాలని, శరీరంలో క్యాలరీస్ ఉంటే ఖర్చు పెట్టేయాలని తెలియజేశారు. మనం తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యమన్నారు. గత 20, 30 సంవత్సరాల క్రితం మన తాతలు, తండ్రులు ఎలాంటి వాకింగ్, యోగా చేయకుండా ఆరోగ్యంగా జీవించారని, ఎందుకంటే వారు వ్యవసాయం చేస్తూ రోజు బావి దగ్గరికి వెళ్లి నడుచుకుంటూ వెళ్లి వచ్చే వారని మరియు ప్రతిరోజు శ్రమించే వారు కాబట్టి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉన్నారని వారు వివరించారు. ప్రతి ఆదివారం ఏదో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 5కే రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సాహావంతులైన యువతి, యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. ఆరోగ్య సిద్దిపేట జిల్లాగా మార్చేందుకు అందరం పాటు పడుదామని అన్నారు.

5కే రన్‌లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలను, ప్రజాప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికి మెమోటోలు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా నంగునూరు గ్రామ సర్పంచ్ మమత జయపాల్ రెడ్డి గ్రామంలో సిసి కెమెరాలకి ఒక లక్ష రూపాయల చెక్‌ను సిపి శ్వేతకు అందించారు. గ్రామాల్లో సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని కోరారు. సిసి కెమెరాల ద్వారా ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ ఉంటుందని 24 గంటలు నిఘా కెమెరాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వేముల వెంకట్ రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, కోల రమేష్ గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రూరల్ సీఐ జానకిరామ్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్‌పెక్టర్ రవి కుమార్, త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ భాను ప్రకాష్, రాజగోపాల్‌పేట ఎస్‌ఐ రాజుగౌడ్, రూరల్ ఎస్‌ఐ కిరణ్ రెడ్డి, చిన్నకోడూరు ఎస్‌ఐ శివానందం మరియు సిబ్బంది, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News