సిద్దిపేట క్రైమ్: ఆరోగ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటు పడాలని, ప్రతిరోజు రన్నింగ్, వాకింగ్, యెగా చేయాలని అదనపు డిసిపి మహేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. శనివారం ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా సిద్దిపేట టుటౌన్ పోలీసుల ఆధ్వర్యంలో 5కె రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా సిద్దిపేట టుటౌన్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఉత్సవంగా పాల్గొన్న సిద్దిపేట పట్టణ ప్రజలు మహిళలు, పిల్లలు, పోలీస్ అధికారులు, సిబ్బంది మంచి ఆరోగ్యం గురించి ప్రతిరోజు రన్నింగ్, వాకింగ్, యోగా చేయాలన్నారు. ఆరోగ్యాన్ని మించింది మరోకటి లేదన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు.
సిపి శ్వేత అదేశాల మేరకు ప్రతివారం ఈ రన్నింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మితమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. సమాజంలో డబ్బులు లేకున్నా బతకవచ్చు కానీ ఆరోగ్యంగా లేకపోతే చాలా కష్టాలు పడతామని ప్రతిఒక్కరూ ఉదయం, సాయంత్రం సమయం దొరికినప్పుడల్లా ఆరోగ్యం గురించి తప్పకుండా నడవాలన్నారు. నడక మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొని వస్తుందని తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉంటే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఉదయం లేవడం చాలా ముఖ్యమన్నారు. మనలో మార్పు వస్తే ఏదైనా సాధింవచ్చని తెలిపారు. అనంతరం మహిళా విభాగం, పిల్లల విభాగం, పురుషుల విభాగాల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎసిపి దేవారెడ్డి, బిఆర్‌ఎస్ నాయకుడు పాల సాయిరాం, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు, యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.